Retired Judges Letter to CJI : తీవ్రమైన ఒత్తిడి, తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని 21మంది సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అనైతికమే కాక, దేశ ప్రజాస్వామ్య విలువలకు హానికరమనీ, న్యాయవ్యవస్థ సమగ్రతను ఇవి దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
'తీర్పులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు'
కొందరికి అనుకూలంగా ఉండే న్యాయ నిర్ణయాలను ప్రశంసించడం, అలా లేని వాటిని తీవ్రంగా విమర్శించడం, న్యాయ సమీక్ష సారాంశాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో అధికార ఎన్డీయే, విపక్షాల మధ్య వాగ్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో మాజీ న్యాయమూర్తులు ఈ లేఖ రాయడం గమనార్హం. న్యాయపరమైన ఫలితాలను, తీర్పులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆయా వర్గాలు అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న మాజీ న్యాయమూర్తులు, అనవసర ఒత్తిళ్లనుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షించాలని సీజేఐను కోరారు. అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థను మూలస్తంభంగా నిలపడం అత్యవసరమని వివరించారు.
-
21 Retired Judges write to Chief Justice of India (CJI) Dy Chandrachud
— ANI (@ANI) April 15, 2024
"We write to express our shared concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disparagement. It has come to… pic.twitter.com/bPZ0deczI2
లేఖపై కాంగ్రెస్ స్పందన ఇలా!
న్యాయవ్యవస్థను బెదిరించడం, భయపెట్టడం వంటి విషయాలపై ప్రధానమంత్రి కావాలనే చేస్తున్న ప్రచారంలో 21 మంది మూజీ న్యాయమూర్తులు సీజేఐకి రాసిన లేఖ భాగమని కాంగ్రెస్ ఆరోపించింది. స్వతంత్ర న్యాయవ్యవస్థకు బీజేపీ నుంచి పెద్ద ముప్పు ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ఇటీవల ఎన్నికల బాండ్లను పెద్ద కుంభకోణంగా వర్ణించిన సుప్రీంకోర్టే వారి టార్గెట్ అని విమర్శించారు.
"న్యాయవ్యవస్థకు అతిపెద్ద ముప్పు కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు. బీజేపీ నుంచే. అది కూడా మిస్టర్ మోదీ నుంచే. మిస్టర్ అమిత్ షా, ఆ లేఖలో నాలుగో సంతకం చేసిన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను మీరు గుర్తు తెచ్చుకోండి. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు, ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో చెబుతోంది" అంటూ జైరాం రమేశ్ వ్యాఖ్యలు చేశారు.