Rajasthan bypoll Violence : రాజస్థాన్‌లో బుధవారం జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డియోలీ-యునియారా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్ననరేశ్ మీనా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) అమిత్ చౌదరిని చెంపదెబ్బ కొట్టారని అధికారులు తెలిపారు. ఈ తర్వాత మీనా, అతని మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని, పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారని పేర్కొన్నారు. పోలీసు వాహనాలతో పాటు పలు వెహికల్‌కు నిప్పు పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నరేశ్ మీనా పరారీలో ఉన్నారని, ఈ ఘటనకు సంబంధించి 60 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈవీఎం మెషీన్లో తన ఎన్నికల గుర్తు సరిగ్గా కనిపించట్లేదని స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎస్డీఎం అమిత్, నరేశ్ మీనా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నరేశ్ మీనా డీసీఎం అమిత్ చెంపపై కొట్టారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల సమ్రావ్త గ్రామంలో ధర్నాకు దిగి, కర్రలు చేత పట్టుకుని రావాలని తన అనుచరులను కోరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై మీనా, అతని అనుచరులు దాడి చేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. మీనా అనుచరుల రాళ్లదాడిలో జితేంద్ర చావ్లా, మహిపాల్, ముఖేశ్ అనే ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసు జీపులతో సహా పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
VIDEO | Rajasthan: Violence erupted outside a polling booth in #Tonk district - where bypolls were being held - when alleged supporters of Independent candidate Naresh Meena pelted stones at police and set ablaze vehicles on Wednesday night.
— Press Trust of India (@PTI_News) November 14, 2024
This happened after the police force… pic.twitter.com/QudylTwKlZ
'అరెస్ట్ చేయకపోతే సమ్మె చేస్తాం'
కాగా, ఎస్డీఎం అమిత్‌పై దాడిని రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ ఖండించింది. అధికారిపై దాడి చేసిన నరేశ్ మీనాను గురువారం ఉదయంలోపు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే సమ్మె బాట పడతామని హెచ్చరించింది. కాగా, నరేశ్ మీనా పరారీలో ఉన్నారు. ఆయనను ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదు.
"సమ్రావ్త గ్రామస్థులు ఉప ఎన్నికను బహిష్కరిస్తామని ప్రకటించారు. నరేశ్ మీనా వారికి మద్దతు ప్రకటించారు. సమ్రావ్త గ్రామం ప్రస్తుతం నగర్ ఫోర్ట్ తహసీల్దారు పరిధిలోకి వస్తుంది. అయితే గ్రామస్థులు దీన్ని ఉనియారాకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎస్డీఎం అమిత్ ఉపఎన్నికల్లో ఓట్లు వేయాలని గ్రామస్థులను ఒప్పించేందుకు వెళ్లారు. ఆయనపై నరేశ్ మీనా దాడి చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేసిన తర్వాత ఈ విషయంపై విచారణ చేపడతాం."
--సౌమ్య ఝా, టోంక్ జిల్లా కలెక్టర్
మరోవైపు, సమ్రావ్తలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి కిరోడి లాల్ మీనా స్పందించారు. శాంతిభద్రతలను కాపాడాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీజీపీ, టోంక్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు.
నవంబరు 13న రాజస్థాన్ వ్యాప్తంగా 7 స్థానాలకు ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడం వల్ల నరేశ్ మీనా ఇండిపెండెంట్ అభ్యర్థిగా డియోలీ-యునియారా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల ఫలితాలు నవంబరు 23న వెలువడనున్నాయి.