Prisoner To Artist Inspirational Story : కొందరి జీవితంలో జరిగిన చెడు విషయాలు కూడా వారి జీవితాన్ని మార్చేస్తాయి. అచ్చం అలాగే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాజ్ కుమార్ జీవితంలో జరిగింది. ఓ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపి మంచి ఆర్టిస్ట్‌గా మారారు. ప్రస్తుతం అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరెందుకు ఆలస్యం రాజ్ కుమార్ విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.
చిన్న తప్పు- మారిన జీవితం!
కోయంబత్తూరు జిల్లా కరమడైకి చెందిన రాజ్ కుమార్ కూలీగా పనిచేసేవారు. 2009లో తనకు తెలిసిన వారి వద్ద బైక్‌ను కొన్నారు. అయితే ఆ వాహనానికి సరైన పత్రాలు లేవు. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయం రాజ్ కుమార్‌కు బైక్ కొనుగోలు సమయంలో తెలియదు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక బైక్ అమ్మేందుకు సిద్ధమయ్యారు రాజ్ కుమార్. అప్పుడు బైక్‌కు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నట్లు తెలిసింది. అయినా పరిస్థితుల కారణంగా వేరొక వ్యక్తికి ఆ బైక్‌ను అమ్మేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో రాజ్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. జైలులోని గోడలపై చిన్నచిన్న చిత్రాలు గీసేవారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ప్రతిభను చూసి ప్రోత్సహించారు. 4నెలల జైలు జీవితం అనుభవించిన తర్వాత రాజ్ కుమార్ విడుదలయ్యారు.
అవకాశాలను అందిపుచ్చుకుని!
జైలు నుంచి రాజ్ కుమార్ విడుదలైన మరుసటి ఏడాదే(2010) కట్టూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అప్పట్లో జరిగిన ప్రపంచ తమిళ శాస్త్రీయ సదస్సులో రాజ్ కుమార్‌కు గోడ పత్రికలు వేసే అవకాశం కల్పించారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాజ్ కుమార్ తన చిత్రకళా నైపుణ్యాన్ని చూపించారు. అందంగా పెయింటింగ్స్ వేసి చూపరులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజ్‌కుమార్ పెయింటింగ్ నైపుణ్యం గురించి తెలుసుకున్న ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అతడికి పునరావాసం కల్పించింది.
రాజ్‌కుమార్‌ను తమ అపార్ట్మెంట్ల గోడలపై పెయింటింగ్స్ వేసే అవకాశాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన కళను మరింత సానబెట్టాడు రాజ్ కుమార్. ఆ తర్వాత భవనాల గోడలపై ఏనుగులు, గుర్రాలు మొదలైన వాల్ పెయింటింగ్‌లు, విగ్రహాలు తయారు చేశాడు. గత 15 ఏళ్లలో మంచి స్థాయికి ఎదిగాడు. కోయంబత్తూరులోని వివిధ భవనాలకు వాల్ పెయింటింగ్స్, విగ్రహాలు తయారు చేస్తున్నాడు. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్త ప్రవేశ ద్వారం నిర్మాణం, దాని చుట్టూ రెండు వైపులా విగ్రహాల రూపకల్పన పనులను రాజ్ కుమార్ చేపట్టాడు. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టు తీసుకున్న ప్రైవేట్ నిర్మాణ సంస్థ రాజ్ కుమార్‌కు విగ్రహాల తయారుచేసే అవకాశాన్ని కల్పించింది.
"4 నెలల జైలు జీవితంలో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. జైలులో దొరికిన బొగ్గు, పెన్సిళ్లతో గోడలపై చిత్రాలు గీసేవాడిని. అది చూసిన జైలు అధికారులు పెయింటింగ్‌పై పూర్తి శ్రద్ధ పెట్టాలని నన్ను ప్రోత్సహించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో కుడ్యచిత్రాలు వేశాను. నా గురించి తెలిసిన ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ విగ్రహాల రూపకల్పనకు అవకాశం ఇచ్చింది. నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తి చేశాను. దీంతో నాకు మంచి పేరు వచ్చి అవకాశాలు పెరిగాయి. ఇప్పటివరకు కోయంబత్తూరులోని చాలా భవనాల ముఖభాగాలను డిజైన్ చేశాను"
- రాజ్‌కుమార్, ఆర్టిస్ట్
"2009లో నేను చేసిన చిన్న పొరపాటు వల్ల నా కుటుంబం బాధపడింది. సాధారణంగా జైలుకు వెళ్లేవారు పశ్చాత్తాప పడతారు. అయితే కొందరు జైలుకు వెళ్లిన తర్వాత మంచి అలవాట్లు నేర్చుకోక, తప్పుడు మార్గనిర్దేశం వల్ల మరిన్ని తప్పులు చేస్తున్నారు. జైలుకు వెళ్లడం వల్ల నా జీవితంలో మార్పు వచ్చింది. నేను సొంత ఇల్లు నిర్మించుకుంటున్నాను. భవన నిర్మాణాలపై నాకు చిన్నప్పటి నుంచే ఆసక్తి. 10వ తరగతి వరకు మాత్రమే చదివాను. నా పెద్ద కుమారుడ్ని అర్కిటెక్చర్ చదివిస్తున్నా" అని రాజ్ కుమార్ తెలిపారు.