Prajwal Revanna Case Chargesheet : హసన్ సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రజ్వల్‌పై నమోదైన నాలుగు కేసులను విచారిస్తున్న సిట్, 2వేల పేజీల ఛార్జిషీట్ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో సమర్పించింది. ఇందులో 150 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని సిట్ అధికారులు తెలిపారు.
చార్జిషీట్‌లో స్పాట్ ఇన్‌స్పెక్షన్, బయోలాజికల్, ఫిజికల్, సైంటిఫిక్, మొబైల్, డిజిటల్, ఇతర విధానాల ద్వారా సేకరించిన ఆధారాలను సిట్ అధికారులు చేర్చారు. అంతేకాకుండా, కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు నిపుణుల అభిప్రాయం తీసుకున్నట్లు సిట్ తెలిపింది. కాగా రేవణ్ణ ఇంట్లో పనిచేసే పనిమనిషి ఫిర్యాదు ఆధారంగా ఆయనపై, ప్రజ్వల్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. రేవణ్ణపై ఐపీసీ సెక్షన్ 354, 354(ఏ), ఆయన కుమారుడు ప్రజ్వల్‌పై ఐపీసీ 376, ఐపీసీ 376 (2), ఐపీసీ 354, ఐపీసీ 354(ఏ), ఐపీసీ 354(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఇదీ కేసు
తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని ఆయన ఫామ్ హౌస్‌లో పనిచేసే యువకుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. కాగా, పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రజ్వల్ జైలులో ఉన్నారు.
సార్వత్రిక పోరులో ప్రజ్వల్ ఓటమి
2024 లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజ్వల్ పోటీ చేసి ఓడిపోయారు. ఏప్రిల్ 26న రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ లైంగిక వేధింపులకు సంబంధించిన కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ ఘటన అప్పట్లో సంచలమైంది. ఈ తర్వాత ప్రజ్వల్ కొన్నాళ్ల పాటు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ భారత్ తిరిగొచ్చి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రమంలో పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత అధికారులు ప్రజ్వల్‌ను జైలుకు తరలించారు.
ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసింది మహిళా పోలీసులే- కావాలనే అలా చేశారట! - PRAJWAL REVANNA ARREST