Pooja Khedkar Trainee IAS Officer : అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా వార్తల్లో నిలిచిన శిక్షణలో ఉన్న IAS అధికారిణి పూజ ఖేద్కర్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. అధికారదర్పం కోసం తహతహలాడిన పూజ ఖేద్కర్, ఓ దొంగను వదిలిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేయటమే కాకుండా ఆమె కారుపై 21 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దొంగతనం కేసులో పట్టుబడిన ఓ వ్యక్తిని విడుదల చేయాలని పోలీసు ఉన్నతాధికారిపై IAS పూజఖేద్కర్ ఒత్తిడి చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి నవీ ముంబయి పోలీసులు ఫిర్యాదు చేశారు. మే 18న పన్వేల్ పోలీస్ స్టేషన్‌లోని డీసీపీ వివేక్ పన్సారేకు ఫోన్ చేసి దొంగతనం కేసులో అరెస్టయిన ఈశ్వర్ ఉత్తరవాడే అనే వ్యక్తిని విడుదల చేయాలని పూజ కోరినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరవాడేపై వచ్చిన అభియోగాలు చిన్నవే అని, అతన్ని వదిలేయాలని కోరినట్లు చెప్పారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఐఏఎస్ అధికారిణి అని నిర్ధరణకు రానందున నిందితుడిని విడుదల చేయలేదని పోలీసులు తెలిపారు. పూజ ఖేద్కర్ ప్రవర్తన గురించి అనేక విషయాలు వెలుగులోకి రావటం వల్ల తాము ఈ విషయాన్ని పుణె కలెక్టర్ కార్యాలయానికి నివేదించినట్లు నవీ ముంబయి పోలీసులు పేర్కొన్నారు.
తన ప్రైవేటు ఆడి కారులో ప్రయాణించే సమయంలో ఖేద్కర్ పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పుణె ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై 21 చలాన్లు ఆమె కారుపై ఉన్నట్లు వెల్లడించారు. అందుకు రూ.27 వేలు జరిమానా కట్టాలని పూజ ఖేద్కర్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగులకు లభించే ప్రయోజనాలు సహా ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసినట్లు పూజ ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి.
పూజ నిర్వాకాలపై ప్రభుత్వం నజర్!
అంతేకాకుండా, ఐఏఎస్‌గా నియామకం కావటానికి దివ్యాంగులకు లభించే ప్రయోజనాలుసహా ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసినట్లు పూజ ఖేద్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారదర్పం చాటుకునేందుకు పనిచేసే చోట ప్రత్యేక వసతులు కల్పించాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరటంపై ఫిర్యాదులు అందటం వల్ల, పూజ ఖేద్కర్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిగ్గుతేల్చేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలు నిజమని తేలితే పూజ ఖేద్కర్‌పై కఠిన చర్యలు తప్పవని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసినవని తేలితే చట్టపరంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ 2 వారాల్లో నివేదిక సమర్పించనుంది.
'కావాలనే నా కుమార్తెను టార్గెట్ చేశారు'
పూజ ఖేద్కర్ గురించి వస్తున్న ఆరోపణలపై ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ స్పందించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన కుమార్తెను టార్గెట్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. వివాదాల నేపథ్యంలో ఖేద్కర్ నివాసానికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఓ మహిళ రెచ్చిపోయారు. తాను తలుచుకుంటే అందరినీ జైల్లో వేయించగలనంటూ కేకలు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
'తుపాకీతో పూజ ఖేద్కర్ తల్లి హల్చల్'
ఇదిలా ఉండగా, పూజ ఖేద్కర్ తల్లి ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో కొందరు గ్రామస్థులను గన్‌తో బెదిరిస్తున్నట్లు ఉంది. మరోవైపు, పూజ తండ్రి దిలీప్ విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టారని, పుణె జిల్లాలో ముల్షీ తాలూకాలో 25 ఎకరాలు సంపాదించారని తెలుస్తోంది. అదే సమయంలో పొరుగున ఉన్న రైతుల భూములను ఆక్రమించాలని యత్నించినట్లు ఆయన కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి.
Now- IAS trainee ofcr Puja Khedkar's mother, Manorama Khedkar's 2mnth old video surfaced, threatening farmers with a pistol to forcibly acquire their land.
— The Hawk Eye (@thehawkeyex) July 12, 2024
This entire family looks fraud. Why this offcr is not sent on leave till the inquiry is concluded?pic.twitter.com/NGJiPfoD6H
అయితే ఈ ఆరోపణలపై ఖేద్కర్ కుటుంబం తరఫు న్యాయవాది రవీంద్ర సుతార్ స్పందించారు. ముల్షీలోని భూమిని ఖేద్కర్ కుటుంబం కొనుగోలు చేసిందన్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానే పూజ తల్లి మనోరమ వెళ్లారని, స్థానికులు ఆమెను అడ్డుకున్నారని తెలిపారు. దీనిపై పౌడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని, ఈ కేసు ప్రస్తుతం పుణె హైకోర్టులో ఉందని చెప్పారు. మనోరమ వద్ద లైసెన్స్డ్ పిస్తోల్ ఉందని, అది ఆత్మరక్షణ కోసమే అని అన్నారు. ఆ వైరల్ వీడియో జూన్ 2023 నాటిదని సమాచారం.