PM Modi's Yoga Day Visit To Kashmir : మరికొద్ది నెలల్లో కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, యోగా దినోత్సవం శ్రీనగర్‌లో జరుపుకోనుండడం వల్ల రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ జమ్ముకశ్మీర్‌లో పర్యటించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఎన్నికల ముందు ప్రధాని మోదీ శ్రీనగర్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆరేళ్ల క్రితం రద్దైన ప్రభుత్వం
2018లో జమ్ముకశ్మీర్ లో చివరిసారిగా ఎన్నికైన ప్రభుత్వం రద్దైంది. పీడీపీ పార్టీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల సర్కార్ కూలిపోయింది. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్ము, కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కొన్నాళ్ల క్రితం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్రపాలిత ప్రాంతంలో ఈసీ బృందం పర్యటించింది. మరోవైపు, ఇటీవల కాలంలో జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శ్రీనగర్ కు పర్యటనకు రానుండడం వల్ల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గత 35ఏళ్లలో ఇదే అత్యధికం. నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రకారం జమ్ములో 43, కశ్మీర్లో 47 స్థానాలు ఉన్నాయి. మొత్తం 90 స్థానాలకు ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా ఎన్నికలు జరగనున్నాయి.
యోగా వేడుకలకు మోదీ- ఫుల్ సెక్యూరిటీ
ప్రపంచ యోగా దినోత్సవం ఈ ఏడాది శ్రీనగర్ లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC)లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో యోగా కేంద్రానికి చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. జూన్ 20న ప్రధాని మోదీ శ్రీనగర్ చేరుకుంటారు. 21న యోగా వేడుకల్లో పాల్గొంటారు. కాగా, వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రధాని మోదీతో కలిసి యోగా చేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రధాని మోదీ శ్రీనగర్‌కు రావడం కశ్మీర్ ప్రజలకు గర్వ కారణమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు