Orwin Noronha Invented Mozziquit : కనిపించే దైవం అమ్మ. అలాంటి అమ్మకు ఏదైనా సమస్య వస్తే చాలా మంది తట్టుకోలేరు. అలాంటిదే ఓ ఘటన నేటి ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణను అందించింది. దోమలు కుట్టడం వల్ల ఓ మహిళకు ఫైలేరియాసిస్ (బోదకాలు) వచ్చింది. తన తల్లికి అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన దోమల భరతం పట్టాలని నిర్ణయించుకున్నారు. అలా 20 సంవత్సరాలు పాటు కష్టపడి ఒక డివైజ్‌ను కనిపెట్టారు. ఆయనే కర్ణాటకు చెందిన ఓర్విన్ నోర్హోన్హా.
మంగళూరు నగర శివార్లలోని కొట్టార పట్టణానికి చెందిన ఓర్విన్ 2002 సంవత్సరంలో మొదలుపెట్టిన ఈ ప్రయోగానికి ఎట్టకేలకు ఫలితం లభించింది. పట్టుదలతో దాదాపు 20 ఏళ్లు రీసెర్చ్ చేసి దోమలను బంధించి చంపే మెషీన్‌ను ఆయన తయారు చేశారు. ఆ మెషీన్‌కు 'మొజిక్విట్' అనే పేరు పెట్టాడు. దీని సైజు ప్రస్తుతం ఇళ్లలో వినియోగిస్తున్న 'గుడ్ నైట్ లిక్విడ్' మెషీన్ కంటే పెద్దగా ఉంది. అయితే 'మొజిక్విట్' మెషీన్‌లో ఎలాంటి లిక్విడ్‌ను పోయాల్సిన అవసరం ఉండదు. కేవలం మనం కరెంటుకు కనెక్ట్ చేస్తే చాలు ఇంట్లో ఉన్న దోమలన్నీ వచ్చి అందులో పడి ఇరుక్కుపోయి చనిపోతాయి.
హైదరాబాద్‌లో చూసిన మెషీన్ వల్లే స్ఫూర్తి
2001 సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చిన ఓర్విన్ నోరోన్హా అక్కడ విక్రయిస్తున్న అమెరికన్ మస్కిటో మ్యాగ్నెట్ మెషీన్‌ను చూశారు. దాని ధర రూ.1.10 లక్షలని, ఆ మెషీన్ మెయింటెనెన్స్‌కు ప్రతినెలా రూ.5వేల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయారు. చివరకు ఆ మెషీన్‌లో వాడే మెటీరియల్ కూడా మన దేశంలో దొరకదని, విదేశాల నుంచే తెప్పించాల్సి ఉంటుందని ఓర్విన్ తెలుసుకున్నారు. అదే రకంగా పనిచేసే మెషీన్‌ను సాధ్యమైనంత తక్కువ రేటుకే ప్రజలకు అందుబాటులోకి తేవాలని అతడు సంకల్పించుకున్నారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు.
'నేను 2002 నుంచి దీనిని తయారు చేయడం ప్రారంభించా. మా అమ్మకు దోమల వల్ల బోదకాలు రావడం వల్లే నేను ఇంత పట్టుదలగా రీసెర్చ్ చేసి మెషీన్ రూపొందించా. నేను రెండు రకాల 'మొజిక్విట్' మెషీన్లను తయారు చేశాను. ఒకటి ఇంట్లో పెట్టుకోవచ్చు. మరొకటి ఆవుల షెడ్లలో ఉపయోగించుకోవచ్చు. ఆవుల షెడ్లలో పెట్టుకునే మెషీన్ కాస్త పెద్ద సైజులో ఉంటుంది. ఈ మెషీన్ ధర రూ.1,250 నుంచి రూ.3వేలు ఉంటుంది' అని ఓర్విన్ వివరించారు.
ఎలా పనిచేస్తుందంటే?
ఇది ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఎలక్ట్రిక్ మెషీన్. దోమలకు ఎరగా ఈ మెషీన్ పైభాగంలో పోయడానికి ఒక ఫుడ్ గ్రేడ్ పౌడర్‌ను ఓర్విన్ నోరోన్హా తయారు చేశారు. ఆ పౌడరును మిక్స్ చేసి మెషీన్ పై భాగంలో పోసి, దాన్ని కరెంటుకు కనెక్ట్ చేయాలి. దీంతో ఆ మెషీన్‌లోని మోటార్ తిరగడం మొదలుపెడుతుంది. అనంతరం మొజిక్విట్ మెషీన్ నుంచి ఒక లైట్ వెలగడం ప్రారంభిస్తుంది. ఆ కాంతిని చూసి దోమలు ఆకర్షితమై అటువైపుగా వెళ్తాయి. ఆ మెషీన్‌లో చిన్నపాటి ఫ్యాన్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్యాన్ గాలి వల్ల దోమలు మెషీన్ లోపల భాగంలో పడిపోతాయి. ఆహారం దొరకక డీహైడ్రేషన్‌కు గురై దోమలు చనిపోతాయని ఓర్విన్ అంటున్నారు.
ప్రముఖ సంస్థల ప్రశంసలు
'మొజిక్విట్' మెషీన్‌ను ఇప్పటికే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ఎన్ఐఎంఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలించాయి. అమెరికాకు చెందిన ఐసీ2 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్సాస్ సైతం 'మొజిక్విట్' మెషీన్‌ను కొనియాడింది. అది గోల్డ్ మెడల్ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న పరికరమని కితాబిచ్చింది. ఇంకా చాలా సంస్థలు ఈ ఆవిష్కరణను కొనియాడాయని ఓర్విన్ అంటున్నారు.