New Criminal Laws In India : బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా కేంద్రం రూపొందించిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఏ కేసులకు వర్తిస్తాయన్న చర్చ ఇప్పుడు మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐపీసీ స్థానంలో రానున్న భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు, శిక్షలు జులై 1 నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయి. సీఆర్‌పీసీ స్థానంలో రానున్న భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) పరిధిలోకి మాత్రం పాతకేసులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఆ చట్టం అమలులో సమస్యలు!
కేసుల విచారణ విధానం గురించి బీఎన్‌ఎస్‌ఎస్ చెబుతుంది కాబట్టి దీన్ని పాత తేదీల నుంచి వర్తింపచేయొచ్చన్నది కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం. ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వస్తున్న భారతీయ సాక్ష్య అధినియమ్ అమలులో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులోని ప్రొసీజరల్ నిబంధనలు పాత కేసులకూ వర్తిస్తాయని, సబ్‌స్టాన్షియల్ నిబంధనలు మాత్రం కొత్త కేసులకే అమలవ్వొచ్చని చెబుతున్నారు.
రెండు రకాల శిక్షలు ఉంటే!
ఒక నేరానికి రెండు రకాల శిక్షలు ఉంటే అందులో తక్కువ శిక్షను నేరస్థులకు విధించాలన్నది న్యాయ సూత్రమని నిపుణులు చెబుతున్నాారు. అందువల్ల కొత్త ఐపీసీ చట్టంలో ఏవైనా నేరాలకు పాత చట్టంలో కంటే బీఎన్‌ఎస్‌లో తక్కువ శిక్ష ఉంటే కొత్త చట్టం ప్రకారమే శిక్ష విధించమని నేరస్థులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉందని కొందరు న్యాయవాదులు పేర్కొంటున్నారు. మరికొందరు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు.
ఐపీసీ పూర్తిగా రద్దయిపోయి, కొత్త చట్టం అమల్లోకి వస్తున్నందున ఒక నేరానికి ఒకే శిక్ష అమల్లో ఉంటుందని, అందువల్ల తక్కువ శిక్ష విధించమని అడగడానికి వీలుండదన్నది వారి వాదన. నేరం జరిగిన రోజు ఏ చట్టం అమల్లో ఉంటే దాని ప్రకారమే శిక్ష ఉంటుందని అంటున్నారు. ప్రొసీజరల్ విషయాలకు మాత్రమే పాతకేసులకు కూడా కొత్త చట్టం వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల అమలు సమయంలో చాలా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని, వాటిపై స్పష్టతకోసం భవిష్యత్తులో కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
106(2) అమలుకు మాత్రం మినహాయింపు
కొత్త న్యాయ చట్టాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్లు వెలువరించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106(2) అమలుకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యేవారికి గరిష్ఠంగా 10 ఏళ్లవరకు శిక్ష విధించొచ్చు. దీన్ని తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో హోంశాఖ పేర్కొంది.
ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మూడు నూతన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను గతేడాది ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత పార్లమెంటరీ స్థాయిసంఘం పరిశీలనకు పంపింది. స్థాయిసంఘం నివేదిక అనంతరం డిసెంబర్ 20న లోక్‌సభ, 21న రాజ్యసభ వీటిని ఆమోదించాయి. అదే నెల 25న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతి తెలపడం వల్ల చట్టరూపం సంతరించుకున్నాయి. ఈ నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తే బ్రిటిష్ వలస పాలన కాలం నుంచీ అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), భారతీయ సాక్ష్యాధార చట్టం (1872) రద్దవుతాయి. మరి కొత్త క్రిమినల్ చట్టాల్లోని ముఖ్యాంశాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.