అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో భద్రతా బలగాలు పహారా పెంచాయి. ఉద్రిక్త పరిస్థితులు కారణంగా రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండురోజుల పాటు పాఠశాలలు, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అదనంగా మరో 5 వేల మందితో కూడిన భద్రత బలగాలను మణిపుర్‌కు పంపనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
హింసాత్మకంగా!
మణిపుర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేస్తుండడంతో భద్రత బలగాలు పహారా పెంచాయి. ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏడు జిల్లాలో అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండు రోజుల పాటు పాఠశాలలు, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు పశ్చిమ ఇంఫాల్‌లో ఆందోళనకారులు నిరసనలు చేశారు. మణిపుర్‌లో హింసను కట్టడి చేయడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాని ఆరోపిస్తూ కోకోమి సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యాలయాలను కోకోమి సంస్థ సభ్యులు మూసివేశారు. మణిపుర్ రాష్ట్ర కార్యాలయం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు నిరసనకారులు తాళాలు వేశారు.
ఎన్ఐఏ దర్యాప్తు
మణిపుర్‌లో చెలరేగిన తాజా హింసపై నమోదైన మూడు కేసుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ దర్యాప్తును చేపట్టింది. ప్రాణనష్టం, శాంతిభద్రతలకు విఘాతం కలగడం వల్ల దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. కుకీ మిలిటెంట్లకు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు మృతిచెందిన కేసుతో పాటు, ఆరుగురు పౌరుల అపహరణ, హత్య కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. సాయుధ మిలిటెంట్లు ఓ మహిళను హత్య చేసిన ఘటనపై నవంబర్ 8న జిరిబామ్ జిల్లాలో మెుదటి కేసు నమోదైంది. సీఆర్పీఎఫ్ పోస్టుపై సాయుధ మిలిటెంట్లు దాడి చేసిన ఘటనపై రెండో కేసు నమోదవ్వగా, పౌరుల హత్య, ఇళ్లకు నిప్పంటించిన ఘటనపై మూడో కేసు నమోదైంది. ఈ మూడు కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.
అదనపు బలగాలు మోహరింపు
మణిపుర్‌లో హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం జరుగుతోన్న అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అదనంగా మరో 5000 మంది భద్రత బలగాలను మణిపుర్‌కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 50 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్- సీఏపీఎఫ్ కంపెనీలకు చెందిన బలగాలను మణిపుర్‌కు పంపనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 35 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్- సీఆర్పీఎఫ్ బెటాలియన్లను, 15 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బెటాలియన్లను కేంద్రం పంపనుంది. ఆరుగురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయటంతో నవంబర్ 12న జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింస మణిపుర్ మెుత్తం వ్యాపించింది. ఈ అల్లర్లను కట్టడి చేసేందుకు ఇప్పటికే కేంద్రం 20 సీఏపీఎఫ్ బృందాలు, 12 సీఆర్పీఎఫ్ బృందాలు, 5 బీఎస్ఎఫ్ బృందాలను మెహరించింది. తాజాగా వాటికి అదనంగా 50 బృందాలతో కూడిన 5000 మందిని పంపించనుంది.