Manipur Mob Lynching : మణిపుర్‌లోని చురచంద్‌పుర్‌లో ఎస్పీ, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లోకి నిరసనకారులు దూసుకెళ్లారు. 300 నుంచి 400 మంది ఆందోళకారులు కార్యాలయాలపైకి గురువారం రాత్రి రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలను సైతం తగలబెట్టారు. కార్యాలయాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఒక ఆందోళనకారుడు మరణించాడు. మరో 30 మందికిపైగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
సాయుధ మూకలతో సన్నిహితంగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌ను ఎస్పీ శివానంద్ సస్పెండ్ చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఆందోళనకారులు రెచ్చిపోయారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కాగా, ఈ ఘటనకు ఎస్పీ శివానంద్ సుర్వే బాధ్యత వహించాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) డిమాండ్ చేసింది. 'ఎస్పీ న్యాయంగా వ్యవహరించకపోతే మేము అతడిని గిరిజన ప్రాంతాల్లో ఉండనివ్వం. వెంటనే హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలి' అని ప్రకటన విడుదల చేసింది.
చురచంద్‌పుర్‌లో హింస నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శుక్రవారం వేకువజామున నుంచి హింస జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఆలాగే చురచంద్పుర్ జిల్లాలో 5రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 'కొందరు సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. అందువల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. వందతులు సృష్టించడం వల్ల ఆందోళనకారులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లుతుంది.' అని ప్రకటన విడుదల చేసింది. '300-400 మంది ఆందోళనకారులు ఎస్పీ ఆఫీస్‌పై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. వారిని నియంత్రించడానికి టియర్ గ్యాస్ వాడాం' అని చురచంద్పుర్ పోలీసులు ట్వీట్ చేశారు.
-
Mob numbering approx. 300–400 attempted to storm the office of SP CCP today, pelting stones, etc. The SF, including the RAF, is responding appropriately by firing tear gas shells to control the situation. Things are under watch..
— Manipur Police (@manipur_police) February 15, 2024
తుపాకులతో కాల్పులు- నలుగురు మృతి
మణిపుర్‌లోని బిష్ణుపుర్ జిల్లాలో ఇటీవలే వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను తుపాకులతో దారుణంగా కాల్చిచంపారు దుండగులు. నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన ఐదారుగురు దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చినట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి పారిపోయారని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మణిపుర్లో మళ్లీ హింస- దుండగుల కాల్పుల్లో నలుగురు మృతి- కర్ఫ్యూ విధించిన సర్కార్