Mamata Banerjee On Sandeshkhali Issue : సందేశ్‌ఖాలీలో మహిళల దుస్థితి చూసి తన హృదయం ముక్కలైందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళల భావోద్వేగాలతో భారతీయ జనతా పార్టీ ఆడుకుందని, ఇప్పుడు కాషాయ పార్టీ చేసిన కుట్రలన్నీ బయటపడుతున్నాయని మమత మండిపడ్డారు. బసీర్‌హాట్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సందేశ్‌ఖాళీ బాధితురాలు బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడడాన్ని దీదీ తప్పుపట్టారు. బీజేపీ పాలనలో మహిళల భద్రత ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉందని దీదీ ఆరోపించారు. సందేశ్‌ఖాలీలోని మహిళలు అవమానానికి గురైనందుకు తాను చింతిస్తున్నానని, తన హృదయం బాధతో నిండిపోయిందని, మహిళల గౌరవంతో ఎవరూ ఆడుకోకూడదని మమత అన్నారు.
ఇదంతా బీజేపీ కుట్ర
వీడియోలు బహిర్గతం అవ్వకపోతే, బీజేపీ కుట్రలు ఎలా పన్నుతుందో ఎవరికీ అర్థం కాకపోయేదని మమతా అన్నారు. బసీర్‌హాట్ లోక్‌సభ స్థానం నుంచి తమ అభ్యర్థి హాజీ నూరుల్ గెలిచిన వెంటనే, తొలుత తాను సందేశ్‌ఖాలీలోనే పర్యటిస్తానని మమతా హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికైనా ఫోన్ చేయవచ్చని, కానీ ఆయన సందేశ్‌ఖాలీలోని రేఖకు ఫోన్ చేసి దీన్ని రాజకీయం చేశారని మమత మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు.
బంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనకు సంబంధించి అధికార టీఎంసీ వారం రోజులుగా వీడియోలు విడుదల చేస్తూ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో బీజేపీ సందేశ్‌ఖాలీ మండలాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న గంగాధర్ కయాల్ మాట్లాడారు. సందేశ్‌ఖాలీ ఘటనలో లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ స్థానిక నేత సత్రాప్ షాజహాన్ షేక్, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న 70 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున ఇచ్చినట్టు పేర్కొన్నారు. 30శాతం మంది మహిళలు ఉండే 50 బూత్‌లలో పంపిణీ చేసేందుకు తమకు రూ.2.5 లక్షలు అవసరమయ్యాయని గంగాధర్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంతృప్తికరంగా డబ్బులు ఇచ్చి ఆందోళనలో ముందు ఉంచి పోలీసులతో తలపడేలా చేయాలని ఆయన చెప్పడం ఆ దృశ్యాల్లో వినిపించింది. దీనిపై మమత తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ కుట్రలను గమనించాలని ప్రజలకు సూచించారు.
ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ- వారికేం తెలుసు కష్టం?: మోదీ - Lok Sabha Elections 2024
ఎమోషనల్‌గా ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ- ఇండియా కూటమిదే పీఠం!: ఖర్గే - Lok Sabha Elections 2024