Mahashivaratri Celebrations In Cemetery : కొన్నేళ్ల ముందు వరకు ఆ శ్మశానానికి వెళ్లాలంటేనే గ్రామస్థులు జంకేవారు. కానీ ఇప్పుడు గ్రామంలోని ప్రజలంతా అక్కడే గడుపుతున్నారు. శుక్రవారం మహాశివరాత్రి వేడుకలను సైతం శ్మశానంలోనే ఘనంగా జరుపుకొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా శ్మశానంలోని శివుడిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని కుర్హా గ్రామస్థులు.
మూడేళ్ల క్రితం గ్రామంలోని శ్మశాన వాటికలో భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కుర్హా వేల్ఫేర్ ఫౌండేషన్. దీంతో అనేక మంది గ్రామస్థులు ప్రతిరోజూ శ్మశానంలోని శివుడిని దర్శించుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రతి మహాశివరాత్రిని అక్కడే ఘనంగా జరుపుకుంటున్నారు గ్రామస్థులు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భారీగా భక్తులు వచ్చారు. వీరికోసం శ్మశానంలోనే వివిధ రకాల తీర్థప్రసాదాలను సిద్ధం చేశారు కుర్హా గ్రామస్థులు.
కుర్హా గ్రామానికి చెందిన యువత 2019లో కుర్హా వేల్ఫేర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. ఈ సంఘం తరఫున శ్మశానంలో స్వచ్ఛతా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గ్రామస్థులంతా ముందుకు రావడం వల్ల నిధులు సేకరించి శ్మశనాన్ని అభివృద్ధి చేశారు. కరోనా సమయంలోనూ శ్మశానంలో శ్రమదానం చేసేవారు. వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్ ప్రోత్సాహంతో, చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేశారు. చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు, ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా చదువుకుంటున్నారు. దీంతో పాటు వాకింగ్, విశ్రాంతి తీసుకోవడానికి శ్మశానానికి వస్తున్నారు. ఇక్కడే గ్రామసభలను సైతం నిర్వహిస్తుంటారు. శ్మశాన భయం పోగొట్టడమే కాకుండా ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించేందుకు ఇలా చేశామని, అందులో తాము విజయవంతం అయ్యామని గ్రామస్థులు చెబుతున్నారు.
శ్మశానంలో బర్త్ డే వేడుకలు
అంతకుముందు కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోనే ఇలాంటి ఘటన జరిగింది. శ్మశానంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు నటి ఆర్యా ఘారే. పుణె జిల్లా పింప్రీ చించ్వడ్లోని శ్మశాన వాటికకు వెళ్లి, కొందరు దర్శకులు, నిర్మాతల సమక్షంలో కేట్ కట్ చేశారు. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఆమె ఇలా చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి