CM Devendra Fadnavis First sign : మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువు దీరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే, సీఎం బాధ్యతలు స్వీకరించిన ఫడణవీస్, తన తొలి సంతకాన్ని ఒక రోగికి ఆర్థిక సాయం అందించే దస్త్రంపై చేశారు.
ఫుణెకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి బోన్‌మ్యారో మార్పిడి చికిత్స అవసరం. దీంతో అతడి భార్య సీఎం సహాయ నిధుల నుంచి సహాయం కోరింది. దీంతో బాధితుడికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందించే దస్త్రంపై తన తొలి సంతకాన్ని చేశారు ఫడణవీస్.
కాగా, ఇటీవలే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 288 స్థానాలకుగాను 230కి పైగా సీట్లను కూటమి పార్టీ కైవసం చేసుకుంది. భాజపా 132 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 సీట్లకు పరిమితమైంది. విజయం సాధించిన మహాయుతి ఫడణవీస్‌ను సీఎంగా ఖరారు చేసింది. శివసేన నాయకుడు ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్‌లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి.
మహా సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం- డిప్యూటీలుగా శిందే, పవార్
కార్పొరేటర్ టూ సీఎం- అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఫడణవీస్