PM Modi Elect as NDA leader : జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ విధానాల కారణంగా గత పదేళ్లలో దేశంలోని 140కోట్ల మంది ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
"దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో NDA ఐక్యంగా పోరాడి విజయం సాధించింది. మోదీ నాయకత్వంలోని NDA ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు, దోపిడీకి గురవుతున్న, అణగారిన వర్గాలకు అభివృద్ధికి కట్టుబడి ఉంది. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి NDA ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది."
--తీర్మానంలో ఎన్డీఏ కూటమి నేతలు
8 లేదా 9న ప్రమాణ స్వీకారం
ఈనెల 8న లేదా 9వ తేదీన మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీ కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. 60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టే నేతగా మోదీ రికార్డులకెక్కనున్నారు.
ఖర్గే ఇంట్లో 'ఇండియా' సమావేశం
మరోవైపు ఇండియా కూటమి నేతలు సైతం తదుపరి వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. రాజ్యాంగ విలువలను కాపాడే నిబద్ధత ఉన్న పార్టీలను కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాము ఐక్యంగా, కృతనిశ్చయంతో పోరాడామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి స్పష్టమైన నైతిక పరాజయమనీ, వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకు భారీ నష్టమని తెలిపారు. ప్రజా తీర్పు మోదీకి, ఆయన రాజకీయ శైలికి వ్యతిరేకంగానే వచ్చిందన్నారు. ప్రజల అభీష్టాన్ని తారుమారు చేయాలని మోదీ నిర్ణయించుకున్నారని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు శరద్ పవార్, స్టాలిన్, చంపయీ సోరెన్, తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి, రాఘవ్ చడ్డా, కల్పనా సోరెన్ సహా ఇతర ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు.
2014 ఎన్నికల్లో 282 స్థానాలు, 2019లో 303 సీట్లతో సొంతంగా మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ, ఈసారి చార్ సౌ పార్ అంటూ నినదించినా మెజార్టీకి అవసమైన స్థానాలు సొంతంగా సాధించలేకపోయింది. 240స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే 32 స్థానాలు తగ్గాయి. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 53మంది ఎంపీల మద్దతుతో ప్రధాని మోదీ మూడోసారి హస్తిన పగ్గాలు చేపట్టనున్నారు.
ఒకే విమానంలో దిల్లీకి నీతీశ్, తేజస్వి- ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? - Lok Sabha Election results 2024