MVA On Maharashtra CM Candidate : త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి తర్వాతే మహావికాస్ అఘాడీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఉన్నందున, వారే తొలుత ప్రకటించాలని అన్నారు. బీజేపీ నేతల పరిస్థితి దారుణంగా ఉందని, వారంతా ద్రోహుల నాయకత్వంలో పోటీ చేయనున్నారని విమర్శించారు. మహా వికాస్ అఘాడీ నాయకులతో కలిసి ఆదివారం ముంబయిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ రాక్రే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
నేరస్థులను చూసీ చూడనట్లు వదిలేస్తుంది!
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారు నిందితులో కాదో తమకు తెలియదని అన్నారు. తమ కదలికలపై నిఘా పెట్టిన సర్కార్, నేరస్థులను చూసి చూడనట్లు వదిలేస్తుందని ఆరోపించారు. అది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం అభ్యర్థి విషయంపై ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ-ఎస్పీ వర్గం అధినేత శరద్ పవార్ సమర్థించారు. ఉద్ధవ్ ఠాక్రే చెప్పింది స్పష్టంగా ఉందని అన్నారు.
On upcoming Maharashtra Assembly polls, Shiv Sena (UBT) chief Uddhav Thackeray says, " let mahayuti announce their cm face first then we will let you all know who is our cm face. being in govt, mahayuti should announce their cm face first" pic.twitter.com/Ig3043QN86
— ANI (@ANI) October 13, 2024
కూటమి పాలనలో మహారాష్ట్ర ధ్వంసం!
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహాయుతి కూటమి పాలనలో మహారాష్ట్ర ధ్వంసమైందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులను అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. మహాయుతి కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అందుకు వారు తమ కూటమికి మద్దతిస్తారన్న నమ్మకం తమకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
NCP-SCP chief Sharad Pawar says, " whatever uddhav thackeray said about cm's face was quite clear and that is it...mukhyamantri majhi ladki bahin scheme was cheating, there is no clarity of budgeting and financial provision for the scheme. if they can make clear and separate… pic.twitter.com/3L1zFWnGcA
— ANI (@ANI) October 13, 2024
ఆ విషయం మోదీ మర్చిపోయారు!
గత లోక్‌సభ ఎన్నికల్లో కనబరిచిన పనితీరునే ఈ శాసనసభ ఎన్నికల్లోనూ మహా వికాస్ అఘాడీ కూటమి నేతలు పునరావృతం చేయాలని పవార్ విజ్ఞప్తి చేశారు. బంజారా వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను శరద్ పవార్ తిప్పికొట్టారు. బంజారా వర్గానికి చెందిన వసంతరావ్ నాయక్ మహారాష్ట్రకు అత్యధిక కాలం సీఎంగా పనిచేశారన్న విషయాన్ని ప్రధాని మరిచిపోయారని పవార్ దుయ్యబట్టారు.
మహారాష్ట్ర ధర్మానికి మోసం!
ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం మోసపూరితమైనదని ఆరోపించారు శరద్ పవార్. ప్రభుత్వం చేసిన ఆర్థిక కేటాయింపులపై స్పష్టత లేదని అన్నారు. ప్రత్యేక నిబంధనలను రూపొందిస్తే తాము వ్యతిరేకించమని చెప్పారు.
రాజ్యాంగవిరుద్ధంగా పదవిలో ఆమె!
మరోవైపు, రాష్ట్రంలో ఎవరూ సురక్షితంగా లేరని బాబా సిద్ధిఖీ హత్యను ప్రస్తావిస్తూ ఆరోపించారు కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే. చిన్నారులు, మహిళలతోపాటు నాయకులకు కూడా భద్రత లేదని, ప్రభుత్వం రాజకీయాలు చేయడంలోనే బిజీగా ఉందని పటోలే విమర్శించారు. పోలీస్ డీజీ రష్మీ శుక్లా రాజ్యాంగ విరుద్ధంగా పదవిలో ఉన్నారని ఆరోపించారు. దీనిపై తాము ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ ఏడాది చివరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.