New CJI of India : దేశ సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కొద్ది రోజుల క్రితం సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా తదుపరి సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు.
సంప్రదాయం ప్రకారం, సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు. ఆ విధంగానే ఆయన సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదం లభించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం ఈ ఏడాది నవంబరు 10తో ముగియనుంది. ఆ తర్వాత రోజే సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరిస్తారు.
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో కీలక భూమిక వహించారు. ఎన్నికల బాండ్లు, 370వ రాజ్యాంగ అధికరణం రద్దు, ఈవీయంల వినియోగానికి సమర్థన వంటి తీర్పులను ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు. దిల్లీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన జస్టిస్ ఖన్నా దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా సమీప బంధువు. 1960 మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1983లో సంజీవ్ ఖన్నా దిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. తర్వాత అక్కడి తీస్‌హజారీ జిల్లా కోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఇక 2005లో దిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో అక్కడే శాశ్వత న్యాయమూర్తిగానూ ప్రమోషన్ పొందారు. జస్టిస్ ఖన్నా ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, భోపాల్‌లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పాలక మండలి సభ్యుడిగానూ ఉన్నారు.