Jayalalitha Gold Jewellery Auction : జరిమానా చెల్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన బెంగళూరు కోర్టు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్లు చొప్పున జరిమానా వేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సమయంలో 2016 డిసెంబరు 5న జయలలిత మరణించారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. జయలలిత మరణించి ఆరేళ్లుకాగా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఇంట్లో అవినీతి నిరోధకశాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు, 800 కిలోల వెండి నగలు, ఇతర వజ్రాభరణాలను కోర్టులో అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. అందుకోసం నగలను మార్చి 6, 7న తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే రూ.40 కోట్ల వరకు ధర పలకనున్నాయి. మిగిలిన రూ.60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయడానికి చర్యలు చేపట్టారు.
'6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి'
అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించింది. మార్చి 6,7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తేదీలను ప్రకటిస్తూ, ఆ రెండు రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు.
కర్ణాటక ప్రభుత్వం వద్ద ఉన్న వస్తువులు
అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిలో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు; 700 కిలోల వెండి వస్తువులు; 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వాటితో పాటు 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు.
'జ్ఞానవాపిలో యథావిధిగా హిందువుల పూజలు'- ఆ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
'కేసు కోర్టులో ఉన్నా పదేపదే సమన్లా?'- ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడోసారి దూరం