Shashi Tharoor Latest Interview : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ప్రజాప్రతినిధిగానే కాదు రచయితగా, వక్తగా ఎంతో గుర్తింపు ఉంది. తన ఆంగ్ల భాష పరిజ్ఞానంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. రాయడమంటే అమితాసక్తి ఉన్న ఆయన, పదేళ్ల వయసులోనే పత్రికల్లో రచనలు ప్రచురితమయ్యాయి. అయితే 1970వ దశకంలో ఐరాసలో చేరిన సమయంలో రచన విషయంలో ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు శశి థరూర్. జేమ్స్ బాండ్‌కు చంపేందుకు లైసెన్స్ ఉన్నట్లే తనకు రాయడానికి లైసెన్స్ ఉందని, రచన విషయంలో ఏటా తన అనుమతిని పునరుద్ధరించాలంటూ చమత్కరించేవాడినన్నారు.
"రాయడమనేది నాకు అలవాటుగా మారిపోయింది. బాల్యంలో అనేక పత్రికలు, మ్యాగజిన్లలో నా రచనలు ప్రచురితమయ్యాయి. రచనా వ్యాసాంగం నన్నెప్పుడూ వదల్లేదు. 1978లో జెనీవాలోని ఐరాస హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR)లో చేరినప్పుడు.. సిబ్బందికి కఠినమైన ప్రవర్తనా నియమావళి ఉండేది. విధులు మినహా ఇతర కార్యకలాపాలకు అనుమతి తప్పనిసరి. కొంతమంది క్రికెట్ ఆడటం, సీతాకోక చిలుకలను పట్టుకోవడం, స్టాంపుల సేకరణ వంటివి చేయగలిగితే.. నేనెందుకు రాయకూడదు? అని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఐరాస సభ్యదేశాలను కించపరచకుండా ఉంటాననే షరతుపై వారు అనుమతి మంజూరు చేశారు" అని శశి థరూర్ తెలిపారు.
శశిథరూర్ తన పదేళ్ల వయసులో ఓ భారతీయ ఆంగ్ల పత్రికలో మొదటి కథనాన్ని ప్రచురించారు. 2007 వరకు ఐరాసలో పనిచేసిన సమయంలో అనేక పుస్తకాలు రాశారు. ఐరాస కెరీర్ ప్రారంభంలో తాను రాసిన పుస్తకాల్లో ఓ అసాధారణ 'ఖండన'ను ప్రచురించేవారని శశిథరూర్ తెలిపారు. పుస్తక రచయిత ఐరాస సభ్యుడు అయినప్పటికీ పుస్తకంలోని పాత్రల ద్వారా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు ఆయన అధికారిక హోదాతో ఎటువంటి సంబంధం లేదని పేర్కొనేవారట. ఫిక్షన్ ప్రపంచంలో ఈ విధమైన ఖండనను ప్రస్తావించిన ఏకైక నవలా రచయితను తానే కావొచ్చని చెప్పారు.
కాగా, కేరళలోని తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగోసారి విజయాన్ని అందుకున్నారు శశిథరూర్. ఈ స్థానంలో బీజేపీ తరఫున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీచేయగా ఫలితాల్లో ఇద్దరి మధ్యా గట్టి పోటీ కన్పించింది. చివరకు 16,077 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో థరూర్ గెలుపొందారు