FIR On Nirmala Sitharaman : ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయనాయకులపై బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. పారిశ్రామిక వేత్తలను ఎన్నికల బాండ్ల పేరిట బెదిరించి పలువురు బీజేపీ నేతలు వారి పార్టీకి 8వేల కోట్లకుపైగా నిధులు సమకూర్చుకున్నట్లు జనాధికార సంఘర్ష సమితి సహాధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ ఆరోపించారు. ఈ అంశంపై గతంలో తిలక్ నగర ఠాణాలో ఆయన ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించలేదు. పోలీసుల తిరస్కరణ నేపథ్యంలో ప్రజాప్రతినిథుల కేసుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదర్శ్ అయ్యర్ అభియోగం మోపిన వారిపై కేసు నమోదు చేయాలని తిలక్‌నగర్ ఠాణా పోలీసులను తాజాగా ఆదేశించింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి విరాళాల పేరుతో కార్పొరేట్ సంస్థలను బెదిరించి దోచుకున్నారని ఫిర్యాదుదారు ఆదర్శ్ అయ్యర్ ఆరోపించారు. అందుకే కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
"సీఆర్‌పీసీ 153 కింద న్యాయస్థానం విచారణ జరపాలని ఆదేశించింది. నిందితుల్లో నిర్మలా సీతారామన్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఏ3గా భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ ఆఫీస్ బేరర్లు, ఇతరులు, నాలుగో నిందితుడిగా కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, ఐదో నిందితుడిగా ప్రస్తుత బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఉన్నారు."
--ఆదర్శ్ అయ్యర్, ఫిర్యాదుదారు
'నిర్మలా సీతారామన్ రాజీనామా చేస్తారా'
తాము పార్లమెంట్‌లో లేవనెత్తిన ఎలక్టోరల్ బాండ్ వ్యవహారాన్న ఎవరో కోర్టు వరకూ తీసుకెళ్లారని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. విచారణలో ఏం జరుగుతుందో వేచిచూద్దామన్నారు. ఈ కేసులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. ముడా భూ కేటాయింపుల కేసులో తనను రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టిన బీజేపీ శ్రేణుల ప్రకారం, ఎఫ్‌ఐఆర్ నమోదైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాజీనామా చేయాలన్నారు. కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై జేడీఎస్ నేత కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండిపడ్డారు. నిర్మలా సీతారామన్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ఆమె రాజీనామా చేయడానికి ఎలక్టోరల్ బాండ్ నిధులు ఏమైనా ఆమె వ్యక్తిగత ఖాతాలోకి వెళ్లాయా లేక కాంగ్రెస్ నేతల్లా అధికారాన్ని దుర్వినియోగ పరిచి లబ్ధి పొందారా అని ప్రశ్నించారు.
ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీం తీర్పును స్వాగతించిన కాంగ్రెస్- ఓట్ల పండగను బలపరుస్తుందని హర్షం
'ఎలక్టోరల్ బాండ్ల లెక్క ఇదీ!'- సుప్రీంకోర్టులో స్టేట్ బ్యాంక్ అఫిడవిట్