Easy Ways to Cooking Mutton in Less Time: నాన్‌వెజ్‌లో ఎన్ని వెరైటీస్ ఉన్నా.. మటన్ రేంజ్ వేరే ఉంటది. కారణం.. దీని టేస్ట్. మసాలాలు దట్టంగా పట్టించి వండితే ప్లేట్లు కూడా నాకేస్తారు. అయితే మటన్ తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో.. దానిని వండే సమయంలో అంత కష్ట పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి త్వరగా ఉడికిపోతే.. మరికొన్ని సార్లు ఎన్ని కుక్కర్ విజిల్స్ వచ్చినా మటన్ ఉడకనే ఉడకదు. అయితే అలాంటి సమయంలో టెన్షన్ పడకుండా ఈ చిట్కాలు పాటిస్తే మటన్ త్వరగా ఉడుకుతుందని.. పైగా టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరి లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా..
రాళ్ల ఉప్పు: మటన్‌ను తొందరగా ఉడికించడంలో రాళ్ల ఉప్పు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు అన్నీ పోయేలా బాగా గట్టిగా పిండాలి. ఆ తర్వాత ఆ మాంసంలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి బాగా కలిపి ఒక గంట తర్వాత వండితే మాంసం త్వరగా ఉడికిపోతుందని అంటున్నారు. ఎందుకంటే మాంసం ఉప్పును బాగా పీల్చుకోవడం వల్ల మెత్తగా ఉడికిపోతుందని అంటున్నారు. అయితే రాళ్ల ఉప్పు ప్లేస్‌లో మెత్తటి ఉప్పును ఎట్టి పరిస్థితులలో వాడకూడదని చెబుతున్నారు.
టమాట: టమాటలో కూడా ఆమ్ల గుణం ఉంటుంది. అందుకే వీటిని పేస్ట్ చేసి వేయడం లేదా టమాట సాస్ వేయడం వల్ల ఫలితం కనబడుతుందని అంటున్నారు. అయితే చాలా మంది నాన్‌వెజ్ వంటకాల్లో టమాట ముక్కలను వేసుకుంటూ ఉంటారు. కొంతమంది సాస్‌ని కూడా ఉపయోగిస్తారు. కాకపోతే వీటిని కూర ఉడికిన తర్వాత వేసుకోవడం అలవాటు. అయితే తర్వాత వేయడం కన్నా తాళింపు సమయంలోనే వేసుకోవడం వల్ల మాంసం తొందరగా ఉడుకుతుందని అంటున్నారు.
2019లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మామూలు నీటితో వండిన దాని కంటే టమాట పేస్ట్ లేదా టమాట సాస్‌తో వండిన మటన్ త్వరగా ఉడికిందని.. పైగా రుచిగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M విశ్వవిద్యాలయంలో ఆహార విజ్ఞానం అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ డా. మార్గరెట్ జాన్సన్ పాల్గొన్నారు.
అల్లం తురుము: అల్లంలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్‌ల కారణంగా మాంసం త్వరగా, మెత్తగా ఉడికేలా చేస్తాయని అంటున్నారు. సాధారణంగా కర్రీ చేసేముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఉపయోగిస్తుంటాం. అలా కాకుండా అల్లం తురుమును ముందే వేసి మాంసం ఉడికిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మాంసం తొందరగా ఉడుకుతుందని చెబుతున్నారు.
ప్రతీ వారం మటన్ తింటే - షుగర్ వస్తుందా?
వెనిగర్ లేదా నిమ్మరసం: వెనిగర్ లేదా నిమ్మరసం కూడా మాంసం ఉడకడానికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇవి ఆమ్ల ద్రవాలు కాబట్టి మాంసాన్ని త్వరగా ఉడికేలా చేయడంతో పాటు కూర వండేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వచ్చేలా చేస్తాయని వివరిస్తున్నారు.
బొప్పాయి ఆకు: మటన్ మెత్తగా ఉడికించడానికి బొప్పాయి ఆకు లేదా పచ్చి బొప్పాయిని కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. ఇందులోని పెపైన్ అనే పదార్థం మాంసం మెత్తగా మారడానికి ఉపయోగపడుతుంది.. తద్వారా తొందరగా ఉడుకుతుందని అంటున్నారు.
పెరుగు: మటన్ వండటానికి ఒక గంటసేపు ముందు పెరుగులో నానబెట్టి ఆ తర్వాత వండితే.. మటన్ తొందరగా ఉడికిపోతుందని చెబుతున్నారు. పెరుగుకు బదులు మజ్జిగ వాడినా ఫలితం ఉంటుందని అంటున్నారు.
కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతోందా? అయితే ఈ టిప్స్ పాటించండి!