E-commerce Sites Removed Rat Glue Traps From Their List : ఎలుకల బెడద తొలగించుకోవడానికి జనం పలు రకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. కొందరు విషం పెడతారు. మరికొందరు బోను పెడతారు. అయితే.. కొంత కాలంగా జనాల్లోకి విస్తృతంగా దూసుకెళ్లిన పద్ధతి మాత్రం "గ్లూ ట్రాప్". ఈ పద్ధతి ద్వారా ఎలాంటి శ్రమ లేకుండానే ఎలుకలను పట్టేయొచ్చు. దీంతో.. అందరూ గ్లూ ట్రాప్ ప్యాడ్స్ కొనుగోలు చేయడం మొదలు పెట్టారు.
అలాంటి ప్యాడ్స్‌ను ఇప్పుడు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ తమ సరుకుల జాబితా నుంచి తొలగించాయి. అమెజాన్‌తో సహా భారతదేశంలోని అనేక ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఈ గ్లూ ట్రాప్స్‌ను అన్ లిస్ట్ చేశాయి. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ గ్లూ ప్యాడ్స్ పై నిషేధం అమల్లో ఉంది. ఇదంతా పెటా ఇండియా (PETA India) పోరాటం వల్ల జరిగింది. మరి.. ఎందుకిలా? ఈ గ్లూపై PETA (People for the Ethical Treatment of Animals) ఎందుకు పోరాడుతోంది అనేది మీకు తెలుసా?
మనిషి.. తన మనుగడ కోసం ఎన్నో జీవుల ప్రాణాలు తీసేస్తున్నాడు. ఆహారం మొదలు.. జీవనం సుఖంగా సాగిపోవడం దాకా.. పలు రకాల కారణాలతో ఎన్నో రకాల జీవ జాతులను బలి తీసుకుంటున్నాడు. అయితే.. ఎలుకలను ఈ "గ్లూ ట్రాప్" ద్వారా చంపే పద్ధతి అత్యంత క్రూరంగా ఉంటోందని "పెటా" ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాంసాహారం కోసం కావొచ్చు.. మరైదా కారణంతో కావొచ్చు.. ఏదైనా జంతువును చంపేటప్పుడు, కొన్ని క్షణాల్లోనే ప్రాణం తీసేస్తారు. కానీ.. ఈ గ్లూ ప్యాడ్ ద్వారా ఎలుకలను చంపడం అత్యంత దారుణంగా ఉంటోందని పెటా వాపోతోంది.
నరకం..
జనం గ్లూ ట్రాప్‌ను తీసుకెళ్లి ఎలుకలు తిరిగే చోట ఉంచి వెళ్లిపోతారు. అటుగా వచ్చిన ఎలుక ఏదో ఒక సమయంలో అందులో చిక్కుకుపోతుంది. అంతే.. మళ్లీ ఎవరైనా వచ్చి చూసే వరకు అందులోనే చిక్కుకొని ఉంటుంది. అప్పటి దాకా ఆ ఎలుక నరకయాతన అనుభవిస్తూ ఉంటుందని పెటా ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందులోనుంచి బయట పడడానికి.. ప్రాణాలు నిలుపుకోవడానికి చేసే విఫల యత్నాల్లో.. ఎలుకలు భయంకరమైన బాధను అనుభవిస్తాయని పెటా కార్యకర్తలు వాపోతున్నారు. ఆ బాధ ఎంత కాలం కొనసాగుతుందో తెలియకుండా ఉంటోందని అంటున్నారు.
తిండి లేక.. నీళ్లు లేక
కొంత మంది ఆ గ్లూ ట్రాప్‌ను పెట్టేసి మరిచిపోతారు. గంటలు, రోజుల తరబడి కూడా అటువైపు చూడరు. ఈ గ్యాప్‌లో అందులో చిక్కుకొని హింస పడడంతోపాటు తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు లేక.. అత్యంత దయనీయ స్థితిలో ఎలుకలు చనిపోతాయని చెబుతున్నారు. మరికొన్ని ఎలుకలు కొన ఊపిరితో రోజుల తరబడి ఆ బంకలో చిక్కుకొని ఉంటాయని చెబుతున్నారు. మూగ జీవాలను చంపడమే దారుణం అంటుంటే.. అలాంటిది ఇంత ఘోరంగా హింసించి చంపే పద్ధతి ఏ మాత్రం న్యాయం కాదంటూ పెటా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. ఈ గ్లూ ప్యాడ్స్‌ను నిషేధించాలని పెటా ఉద్యమం మొదలు పెట్టింది.
దేశవ్యాప్త మద్దతు..
పెటా పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పెటా చెబుతున్న మాటలను అంగీకరిస్తూ.. ఇకపై తమ ఆన్లైన్ స్టోర్లలో ర్యాట్ గ్లూ ట్రాప్ లను విక్రయించబోమంటూ.. ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు.. అమెజాన్, మీషో, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జియోమార్ట్ వంటివి నిర్ణయం తీసుకున్నాయి. తమ లిస్టులోంచి దాన్ని తొలగించాయి. దీంతో.. పెటా ఇండియా హర్షం ప్రకటించింది. మిగిలిన సంస్థలు కూడా ఈ బాటలో నడవాలని కోరింది. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో ఈ గ్లూ ట్రాప్ అందుబాటులో ఉండకపోవచ్చనే చర్చ సాగుతోంది.