DoT To Blocks Mobile Handsets Used In Cybercrimes : సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. 28,200 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయాలని, అంతేకాకుండా వాటికి అనుసంధానమైన 20లక్షల మొబైల్ కనెక్షన్లను రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. DoT, కేంద్ర హోం శాఖ, రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఈ పనిని చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మోసగాళ్ల నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడం, డిజిటల్ ప్రమాదాల నుంచి పౌరులను రక్షించడమే తమ సంయుక్త లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర హోం శాఖ, ఆయా రాష్ట్ర పోలీసులు కలిసి జరిపిన విశ్లేషణలో సైబర్ క్రైమ్‌లలో 28,200 మొబైల్ హ్యాండ్సెట్లను దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఈ నివేదికను DoT మరింత విశ్లేషించి, దుర్వినియోగమైన మొబైల్ హ్యాండ్సెట్లలో 20 లక్షల నంబర్లను ఉపయోగించినట్లు కనుగొంది. అనంతరం ఈ మొబైల్ హ్యాండ్సెట్లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేయాలని, వాటికి అనుసంధామైన 20 లక్షల మొబైల్ కనెక్షన్లను వెంటనే రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంపై మాజీ ఐపీఎస్, సైబర్ నిపుణుడు త్రివేణి సింగ్ 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను నిరుత్సాహపరుస్తాయని తెలిపారు. 'సైబర్ మోసానికి సంబంధించిన నేరాల్లో పౌరులు ఫిర్యాదులు చేసే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. దీని ద్వారా గణనీయమైన డేటా బ్యాంక్ ఏర్పడింది. ఈ డేటా బ్యాంక్ ప్రధాన సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో కీలకంగా మారుతోంది. ఇది భవిష్యత్తులో సైబర్ నేరాలను అరికట్టడంలో సహాయపడుతుంది' అని త్రివేణి సింగ్ వివరించారు.
నేరస్థులను అణిచివేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్య అద్భుతమైన ముందడుగు అని నేషనల్ సైబర్ సెక్యూరిటీ మాజీ కో-ఆర్డినేటర్ రాజేశ్ పంత్ 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా చెప్పారు. అయితే దేశంలో సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు కఠిన చట్టాల ఆవశ్యకతను కూడా పంత్ నొక్కిచెప్పారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సులవుగా బెయిల్ పొందుతున్నారని, జైలు నుంచి విడుదలైన తర్వాత సాక్ష్యాలను చెరిపివేయవచ్చని అన్నారు. దీంతో చట్ట అమలుకు సవాళ్లు ఎదురవుతాయని పంత్ అభిప్రాయపడ్డారు. చట్టంలో కఠినత పెరగడం వల్ల ఇలాంటి నేరాలు గణనీయంగా తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 2019లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు సైబర్ మోసాలను సులవుగా నివేదించవచ్చు.
ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు హతం- 900మందితో రౌండప్! - Maoist Encounter Chhattisgarh