Wife And Husband Ends Life In Agra : ఓ ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మరణించిన మరుసటి రోజే ఆర్మీ కెప్టెన్‌గా ఉన్న ఆయన భార్య కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్తతో పాటే తనకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.
ఇదీ జరిగింది
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం- బిహార్‌కు చెందిన దీనదయాళ్ దీప్(32) ఆగ్రాలో ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్నారు. 2022 డిసెంబర్లో రాజస్థాన్‌కు చెందిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ క్యాంపస్‌లోనే నివాసం ఉంటున్నారు. రేణు తన్వర్ కూడా ఆగ్రాలోని మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కెప్టెన్‌గా వ్యహరిస్తున్నారు. అక్టోబర్ 14(సోమవారం) తన తల్లికి వైద్యం చేయించుకునేందుకు సోదరుడితో కలిసి దిల్లీ ఎయిమ్స్ వెళ్లారు రేణు. అక్కడే దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీకి చెందిన గెస్ట్ హౌస్‌లో బస చేశారు.
అయితే సోమవారం రాత్రి దీప్ విధులు ముగించుకుని స్నేహితులతో కలిసి భోజనం చేశాక తన గదికి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం డ్యూటీకి రాకపోవడం వల్ల సిబ్బంది వెళ్లి తలుపు తట్టి పిలిచినా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా దీప్ శవమై కనిపించారు. ఈ సమాచారాన్ని ఆయన భార్యకు చెప్పేందుకు కెప్టెన్ రేణు సంప్రదించడానికి ప్రయత్నించినట్లు ఆగ్రా ఏసీపీ తెలిపారు. కానీ, ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు.
గెస్ట్ హౌస్‌లో బలవన్మరణం
బుధవారం ఉదయం కెప్టెన్ రేణు తన్వర్ మృతి చెందినట్లు దిల్లీ డీసీపీ సురేంద్ర కుమార్ చౌదరి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. దిల్లీలోని ఆర్మీ గెస్ట్ హౌస్‌లోనే బలవర్మణానికి పాల్పడ్డారని, భర్తతో పాటే తను కూడా అంత్యక్రియలు నిర్వహించాలంటూ రాసి ఉన్న ఓ నోట్ దొరికిందని చెప్పారు. మంగళవారం ఎయిమ్స్‌లో ఉండగా దీప్ మరణం గురించి తెలిసి షాక్ గురయ్యారని, ఆ తర్వాత గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బుధవారం సాయంత్రం రేణు తన్వర్ మృతదేహాన్ని ఆగ్రా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ పోర్స్ కాంపౌండ్‌లో ఉంచారు. గురువారం మృతదేహాలను కుటుంబ సభ్యులు బిహార్ తీసుకెళ్లనున్నారని పేర్కొన్నారు. భార్యాభర్తల ఆత్మహత్యకు గల కారణలపై పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
NOTE: 'అన్నింటికీ బలవన్మరణ పరిష్కారం కాదు' - ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే స్నేహ ఫౌండేషన్ -04424640050కు కాల్ చేయండి. 24x7 అందుబాటులో ఉంటుంది. సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ -9152987821(సోమవారం - శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది)