Delhi Election 2025 Congress Candidates : వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకుగానూ 21 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ గురువారం తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ నగర విభాగం చీఫ్ దేవేందర్ యాదవ్ బాదలీ నియోజకవర్గం నుంచి, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ న్యూ దిల్లీ నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులపై చర్చించి ఈ జాబితాకు ఆమోదముద్ర వేసింది. ఇండియా కూటమిలో ఉన్నా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య ఎన్నికల పొత్తు ఉండబోదని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు.
Congress releases first list of 21 candidates for Delhi elections.
— ANI (@ANI) December 12, 2024
Delhi Congress chief Devender Yadav to contest from Badli, Ragini Nayak from Wazirpur, Sandeep Dikshit from New Delhi, Abhishek Dutt from Kasturba Nagar. pic.twitter.com/ceb8QcGCkK
కేజ్రీవాల్ x సందీప్ దీక్షిత్! ఆసక్తికర పోరు!
న్యూదిల్లీ నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్‌ను బరిలోకి దింపింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం న్యూ దిల్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఇదే స్థానంలో కేజ్రీవాల్ పోటీ చేయాలనుకుంటే ఇద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొనే అవకాశం ఉంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందీప్ తల్లి షీలా దీక్షిత్‌ను ఈ స్థానంలో కేజ్రీవాల్ ఓడించారు.
పది సవంత్సరాల్లో దిల్లీ చాలా సమస్యలు ఎదుర్కొందని కాంగ్రెస్ నేత ఖాజీ నిజాముద్దీన్ అన్నారు. దిల్లీ రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులకు కేంద్రం, దిల్లీ ప్రభుత్వం పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయన్నారు. దీని పర్యవసానాలు ప్రజలు అనుభవిస్తున్నారని, రెండు ప్రభుత్వాలకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటున్నారని అన్నారు.