Congress On Agnipath Scheme : సైనిక బలగాల నియామకం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ యువతకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని రద్దు చేసి పాత విధానం ప్రకారం నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. పాత విధానం రద్దు చేయడం వల్ల రెండు లక్షల మంది యువతీయువకుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆరోపిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. వారికి న్యాయం చేయాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
"అగ్నిపథ్ పథకంతో అనేక సమస్యలు ఉన్నాయి. దీని వల్ల ఒకే కేడర్‌లోని సైనికుల మధ్య వివక్ష ఏర్పడుతుంది. ఒకే పని చేసినప్పటికీ వేతన భత్యాలు మాత్రం వేరుగా ఉంటాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత మెజారిటీ అగ్నివీరులు అనిశ్చితితో కూడుకున్న జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తారు. ఇది సామాజిక స్థిరత్వానికి కూడా ప్రమాదకరమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2019-2022 మధ్య 2 లక్షల మంది యువత త్రివిధ దళాల్లో చేరారు. అన్ని కష్టాలు ఎదుర్కొని సైన్యంలో సేవలందించారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెడుతున్నట్లు 2022 మే 31న ప్రభుత్వం చేసిన ప్రకటనతో వారి ఆశలన్నీ నీరుగారాయి.
'అగ్నిపథ్' స్కీమ్ ప్రకటనతో సైన్యం ఆశ్చర్యానికి గురైందని; నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఇది పిడుగుపాటు లాంటి వార్త అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. సైన్యం చేరాలని ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డ యువతలో నిరాశ పెరుగుతోంది. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మన యువత ఇలా బాధపడకూడదు. న్యాయం జరిగేలా మీరే చూడాలి."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
'మోదీ గ్యారంటీ ఇదే'
ఈ లేఖను మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ లేఖను షేర్ చేశారు. దేశభక్తి కలిగిన యువత వెంటే కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది యువత కలలను బీజేపీ నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉంటే, కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొన్నారు. మోదీ గ్యారంటీ అంటే ఇదేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'దీర్ఘకాలంలో లాభమేమీ లేదు'
మరోవైపు, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇదే అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్- అగ్నిపథ్ స్కీమ్ తీసుకురావాలన్న డిమాండ్ ఏదీ లేదని గుర్తు చేశారు. ప్రభుత్వానికి కొంత డబ్బు ఆదా అవ్వడం తప్పితే దీర్ఘకాలంలో ఈ పథకం వల్ల లాభం లేదని అన్నారు. 'పాత నియామక విధానానికి వెళ్లడమే ఉత్తమం అని కాంగ్రెస్ భావిస్తోంది. ఆర్మీని ఆధునికీకరించాలంటే పాత విధానంలోనూ చేయవచ్చు. ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలకు గండి కొట్టినట్లే. ఆగమేఘాల మీద, భవిష్యత్‌లో ఆర్మీ పనితీరు ఎలా ఉంటుందనే విషయాన్ని పెద్దగా ఆలోచించకుండా ఈ స్కీమ్ తీసుకొచ్చారు' అని పేర్కొన్నారు పైలట్.
ఏంటీ అగ్నిపథ్?
2022 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 17½ ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకం కింద ఆర్మీలో చేరేందుకు అర్హులు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలందిస్తారు. ఆ తర్వాత అందులోని 25 శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన ఆర్మీలో చేర్చుకుంటారు. మిగిలిన 75 శాతం మంది బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత బయటకు వెళ్లేవారికి పెన్షన్లు వర్తించవు. వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ.11.71 లక్షలు అందిస్తారు. సైనిక బలగాల ఆధునికీకరణ, సైన్యం సగటు వయసు తగ్గించడం వంటి పలు లక్ష్యాలతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం ప్రకటించిన సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఏమిటీ 'అగ్నిపథ్'? వారి నుంచి ఎందుకింత వ్యతిరేకత?
'అగ్నిపథ్ పథకం సరైనదే.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేం' దిల్లీ హైకోర్టు సమర్థన