Congress CEC Meet : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తొలిసారి సమావేశమైంది. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, శశిథరూర్, అంబికా సోనీ, సింగ్ దేవ్‌తో పాటు సీఈసీ సభ్యులు హాజరు కాగా, రాహుల్ గాంధీ వర్చువల్‌గా పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసే నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు చేశారు. తొలుత దిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, లక్షద్వీప్, కేరళ, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపుర్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో 60 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించిన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ 195 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.
ఏప్రిల్ లేదా మేలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే రాహుల్ గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, ప్రియాంకను రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయాలని పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు సూచించినా, దీనిపై పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం తర్వాతే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే బుధవారం దీనికి భిన్నంగా ఓ ప్రకటన చేశారు అమేఠీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్. 'రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమేఠీ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నారు' అని దిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు ప్రదీప్. అయినప్పటికీ ఈ ప్రకటనను పార్టీ అధిష్ఠానం ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.