Lok Sabha Election Result 2024 : కేంద్రంలో NDA కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, 1962 తర్వాత వరుసగా ఒకే ప్రభుత్వం మూడోసారి కొలువుదీరనుండటం ఇదే తొలిసారని చెప్పారు. ఇదొక చారిత్రక ఘట్టమని తెలిపారు. దేశంలోని ప్రతి ఓటరుకూ అభినందనలు తెలిపిన మోదీ, ఎన్నికల వల్లే దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గణనీయ రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటమి పాలైందన్నారు. సుదీర్ఘకాలంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల వ్యవస్థ, విశ్వసనీయత కలిగి ఉన్నందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం పట్ల ప్రజల విశ్వాసానికి లభించిన విజయమని ప్రధాని అభివర్ణించారు.
1962 తర్వాత తొలిసారి రెండుసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం వరుసగా మూడోసారి తిరిగి అధికారంలో వచ్చింది. పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా ఎన్డీయేకు అద్భుత విజయం దక్కింది. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. పూరీ జగన్నాథుడి నేలపై తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు. కేరళలోనూ బీజేపీ సీటు గెలుచుకుంది. కేరళలో మా పార్టీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు.
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
"మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, దిల్లీలో దాదాపు క్లీన్ స్వీప్ చేశాం. దేశంలోని కోట్ల మంది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నాం. మేం రాకముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. 2014కి ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవి. మా సేవలు చూసే ప్రజలు మూడోసారి పట్టం కట్టారు. ఈసారి మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొని గత రికార్డులు తిరగరాశారు. 12 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించాం. నాలుగు కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించాం. దేశ హితం కోసం నిత్యం ఆలోచిస్తాం. ఆ దిశగా అడుగులు వేస్తాం. మేం చేపట్టిన పనుల వల్ల దేశం ప్రగతిపథంలో పయనిస్తోంది. మీ ఆశీర్వాదమే నిరంతరం పనిచేసేందుకు నాకు ప్రేరణ కలిగిస్తోంది. మీరిచ్చిన స్ఫూర్తితో రోజుకు 18గంటలు పనిచేస్తున్నా. మన ఎన్నికల ప్రక్రియ చూసి ప్రజలంతా గర్వపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఉత్సాహంతో చూశాయి." అని మోదీ తెలిపారు.