Bharat Gaurav Train 2024 : దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, సందర్శనా ప్రదేశాలను చూడాలనుకునేవారికి శుభవార్త. దేశంలో పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వేశాఖ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది. ఈ రైలులో ప్రయాణించి మే 17 నుంచి 28 వరకు పూరీ, కాశీ, అయోధ్య వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలు, సందర్శనా ప్రదేశాలు మీదుగా వెళ్లే ఈ టూర్ ప్యాకేజీ ఎంతో? టూర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్- అయోధ్య మధ్య భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపాలని నిర్ణయించింది. ఉదయపుర్‌లో మే 17న ఈ రైలు బయలుదేరి మళ్లీ మే 28న అయోధ్యకు చేరుకుంటుంది. మొత్తం 12 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో పూర్తిగా థర్డ్ ఏసీ రైలు బోగీలు ఉంటాయని ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ యోగేంద్ర సింగ్ గుర్జార్ తెలిపారు. అందువల్ల వేసవిలోనూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగదని చెప్పారు.
'ప్రయాణికులకు స్టాండర్డ్ కేటగిరీ, కంఫర్ట్ కేటగిరీ అనే రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ కేటగిరీ ప్యాకేజ్ ధర రూ.26,660. ఇందులో ఏసీ కోచ్‌లో ప్రయాణం, నాన్ ఏసీలో వసతి, నాన్ ఏసీ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. కంఫర్ట్ కేటగిరీ ధర రూ.31,975. ఈ ప్యాకేజ్‌లో ఏసీ బోగీలో ప్రయాణం, ఏసీ రూమ్స్‌లో వసతి, ఏసీ బస్సుల్లో ప్రయాణం ఉంటుంది' అని యోగేంద్ర సింగ్ గుర్జార్ చెప్పారు.
ఇదే టూర్ షెడ్యూల్
- మే 17- భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఉదయ్పుర్లో బయలుదేరుతుంది. రెండు రోజులు చిత్తోర్ గఢ్, భిల్వాఢా, అజ్మేర్, జయపుర మీదుగా పూరీకి ప్రయాణం సాగుతుంది.
- మే 19- పూరీ చేరుకుంటుంది. అక్కడ కొలువైన జగన్నాథుడిని భక్తులు దర్శించుకుంటారు.
- మే 20- తర్వాత కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని దర్శించుకుంటారు.
- మే 21- రైలు కోల్‌కతా చేరుకుంటుంది. బస్సు మార్గం ద్వారా భక్తులు గంగాసాగర్‌కు చేరుకుంటారు. గంగాసాగర్‌ను సందర్శించిన తర్వాత ప్రయాణికులు మే 21వ తేదీ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు.
- మే 22- మళ్లీ గంగాసాగర్ నుంచి ప్రయాణికులు కోల్‌కతా చేరుకుంటారు. కాళీఘాట్‌ను సందర్శిస్తారు. దర్శనం అనంతరం జస్దిహ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
- మే 23- కోల్‌కతా నుంచి బిహార్‌కు చేరుకునేందుకు రైలులో ప్రయాణిస్తారు.
- మే 24- బిహార్‌లోని గయాకు చేరుకుంటారు. అక్కడ మహాబోధి, విష్ణుపాద్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
- మే 25- రైలు వారణాసికి చేరుకుంటుంది. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవీ ఆలయాలను దర్శించుకుంటారు. అదే రోజు సాయంత్రం సరయూ నది ఒడ్డున గంగా హారతిని వీక్షిస్తారు.
- మే 26- రైలు వారణాసి నుంచి బయలుదేరి అయోధ్య చేరుకుంటుంది. అయోధ్యలో కొలువుదీరిన రామయ్యను దర్శించుకుంటారు. హనుమాన్ గఢీని సైతం సందర్శిస్తారు.
- మే 28- మే 26 రాత్రి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అయోధ్య నుంచి బయలుదేరి మే 28న ఉదయపుర్ చేరుకుంటుంది.
ఈ ప్యాకేజ్ కింద మీకు ప్రయాణ, భోజన వసతులు, భక్తులకు ఆలయ దర్శన సౌకర్యాలు కల్పిస్తారు. ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సదుపాయం, ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) కూడా పొందొచ్చు. 9001094705, 8595930998 ఈ రెండు నంబర్లకు కాల్ చేసి ఈ ప్యాకేజీ గురించి ప్రయాణికులు తెలుసుకోవచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కూడా ప్యాకేజీ గురించి వివరాలు తెలుసుకోవచ్చు.