Best Places for Trekking in India: ప్రకృతిలో గడపడం చాలా మందికి ఇష్టం. ఇలాంటి వాళ్లు ట్రెక్కింగ్ వెళ్లడానికీ ఇష్టపడతారు. రోజువారీ జీవితంలోని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికీ.. మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవ్వడానికీ ట్రెక్కింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకుంటే.. ఇండియాలో అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయి.
![ఫ్లవర్ వ్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_flower.jpg)
ఫ్లవర్ వ్యాలీ : ఇది భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటని చెప్పొచ్చు. ఇక్కడికి పర్యాటకులు ఎవరైనా ట్రెక్కింగ్ ద్వారానే చేరుకోగలరు. 1980లో భారత ప్రభుత్వం దీన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్‌గా గుర్తించింది. 2002లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తించింది. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ జోషిమత్ సమీపంలోని గోవింద్‌ఘాట్ అనే చిన్నపట్టణం నుంచి ప్రారంభమవుతుంది. అయితే.. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వెళ్లడం అంత తేలిక కాదు. అందుకు తగ్గ సన్నద్ధత చేసుకొని మంచి ప్రణాళికతో వెళ్తేనే సాధ్యం.
![కేదార్ నాథ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_kedar.jpg)
కేదార్ నాథ్: ఈ పవిత్ర పట్టణం ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయాల్లో ఉంది. హిందూ పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్‌లో ఒకటి. కేదార్‌నాథ్‌కు ట్రెక్కింగ్‌తో వెళ్లడం సవాలుతో కూడుకున్నది. కేదార్‌నాథ్‌కు గౌరీకుండ్ నుంచి 16 కిలో మీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
![రూప్‌కుండ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_rupkund.jpg)
రూప్‌కుండ్: ఉత్తరాఖండ్‌లోని ఈ సరస్సును మిస్టరీ లేక్ లేదా స్కెలిటన్ లేక్ అని పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి సుమారు 16,499 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఇక్కడికి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. మరోవైపు ఈ సరస్సు గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఇందులో మంచు కరిగినప్పుడు అనేక మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇది హిమాలయ పర్వతాల్లో ఉండటంతో ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఆ మార్గం చాలా సుందరమైన దృశ్యాలను కలిగి ఉంటుంది. గొప్ప అనుభూతి పొందుతారు.
![హర్ కీ డన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_har-ki-don.jpg)
హర్ కీ డన్: హర్ కీ డన్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి సుమారు 14వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. మంచు శిఖరాలు, పచ్చని అడవులు, నిర్మలమైన నదులతో ఇది ఉంటుంది. హర్ కీ డన్ చేరుకోవడానికి గౌరీకుండ్ నుంచి 16 కి.మీ ట్రెక్కింగ్ చేయాలి.
![మార్ఖా వ్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_marka.jpg)
మార్ఖా వ్యాలీ: మార్ఖా వ్యాలీ అనేది లద్దాఖ్‌లోని ఒక ఎత్తైన హిమాలయన్ లోయ. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, విస్తృతమైన పచ్చిక భూములు, మంచుతో కప్పబడిన హిమానీనదాలకు నిలయం. ఈ ట్రెక్కింగ్ పూర్తి చేయడానికి సుమారు 10 నుంచి 14రోజులు పడుతుంది. మార్ఖా వ్యాలీ సందర్శించడానికి ఉత్తమ సమయం మే నుంచి సెప్టెంబర్. ఈ నెలల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
![చంద్రశిలా ట్రెక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_chandra-shila.jpg)
చంద్రశిలా ట్రెక్: ఉత్తరాఖండ్‌లోని ఈ ట్రెక్ చోప్తా నుంచి ప్రారంభమవుతుంది. నందా దేవి, త్రిశూల్ శిఖరాలతో సహా హిమాలయాల అద్భుతంగా కనిపిస్తాయి. చంద్రశిలా ట్రెక్ 16 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సాధారణంగా 8-10 గంటల్లో దీన్ని పూర్తి చేయవచ్చు. డేరియాటాల్ నుంచి ఈ ట్రెక్కింగ్‌ను స్టార్ట్ చేయాలి.
![జోంగ్రీ-గోచలా ట్రెక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_jongri.jpg)
జోంగ్రీ-గోచలా ట్రెక్: ఇది సిక్కింలో ఉంటుంది. దేశంలోని అత్యంత సవాలుగా ఉండే ట్రెక్‌లలో ఒకటి. కాంచనజంగ్ పర్వతశ్రేణి అద్భుతమైన దృశ్యాలను ఈ ట్రెక్‌లో చూడొచ్చు. అనేక బౌద్ధ గ్రామాల గుండా వెళ్లే ట్రెక్ సాంస్కృతికంగా కూడా గొప్పది. జోంగ్రీ-గోచలా ట్రెక్ 40 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని పూర్తి చేయడానికి 8-10 రోజులు పడుతుంది. యుక్సోమ్ నుంచి ఈ ట్రెక్కింగ్‌ను స్టార్ట్ చేయాలి.
![పిన్ పార్వతీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_pin-parvati.jpg)
పిన్ పార్వతి పాస్ ట్రెక్: ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని హిమాలయాల్లో ఉన్న ఒక సవాలుతో కూడిన ట్రెక్కింగ్ మార్గం. ఈ ట్రెక్ 55 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని పూర్తి చేయడానికి 5-8 రోజులు పడుతుంది. భుంటర్ నుంచి ఈ ట్రెక్కింగ్‌ను స్టార్ట్ చేయాలి.
![దూద్‌సాగర్ జలపాతం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_doo-sagar.jpg)
దూద్‌సాగర్ జలపాతం: ఇది గోవా, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ కనుమలలో ఉన్న ఒక అద్భుతమైన జలపాతం. ఇది భారతదేశంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. ఈ జలపాతం మండోవి నదిపై ఉంది. అలాగే చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. దూద్‌సాగర్ జలపాతాన్ని సందర్శించడానికి జూన్ నుంచి సెప్టెంబర్ బెస్ట్ టైం. ఈ సమయంలో జలపాతం పూర్తిగా ప్రవహిస్తుంది. ట్రెక్కింగ్‌కు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
![ఖీర్గంగా ట్రెక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/20658898_last.jpg)
ఖీర్గంగా ట్రెక్: హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీ లోయలో ఉన్న ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గమిది. ఇది 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని పూర్తి చేయడానికి 8-10 గంటలు పడుతుంది. కసోల్ నుంచి ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఖీర్గంగా ట్రెక్‌ను సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుంచి జూన్, ఇంకా సెప్టెంబర్ నుంచి నవంబర్. ఈ నెలల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
గడ్డకట్టే చలిలో మహేశ్ ట్రెక్కింగ్ - ఇదంతా ఆ సినిమా కోసమేనా ?
తండ్రి ట్రైనింగ్.. చీరకట్టులో కోట ఎక్కిన 8 ఏళ్ల చిన్నారి.. ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా!
Trekking: ట్రెక్కింగ్ దిశగా అతివలు.. వీళ్లకు శిఖరాలే సలాం కొట్టాయి.!