Ayodhya Ram Temple Construction Stone : శ్రీరామచంద్రుడి విగ్రహం రూపొందించడాని ఉపయోగించిన శిలను, రామ మందిర నిర్మాణంలో వాడిన రాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేశారు కర్ణాటకు చెందిన శాస్త్రవేత్తలు. ఆలయ నిర్మాణం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర, సాదరహళ్లి, దేవనహళ్లిలో లభించిన రాళ్లను ఉపయోగించారు. పునాది నిర్మాణం కోసం తెలంగాణలోని వరంగల్, కరీంనగర్‌లోని క్వారీల్లో లభ్యమైన రాళ్లను వినియోగించారు. ఫ్లోరింగ్ కోసం రాజస్థాన్‌కు చెందిన మక్రానా మార్బుల్స్, బాల రాముడి విగ్రహం కోసం మైసూర్‌లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణశిలను ఉపయోగించారు.
"రామలల్లా విగ్రహాం కోసం చాలా రాళ్లను పరిశీలించాం. చివరకు మూడు రాళ్లను ఎంపిక చేశాం. అందులో రెండు మైసూర్‌కు చెందినవి. ఇంకొకటి మక్రానా మార్బుల్. గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం మైసూర్ కృష్ణశిలతో రూపొందింది." - రాజన్ బాబు, ఎన్ఐఆర్ఎం సీనియర్ శాస్త్రవేత్త
ఆలయానికి ఎలాంటి నాణ్యత ఉన్న రాయిని ఉపయోగించాలి, ఎలా నిర్మించాలి అనే విషయాలపై కోలార్‌లోని కేజీఎఫ్ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు వివిధ రాష్ట్రాలకు వెళ్లి రాళ్ల నాణ్యతను పరీక్షించారు. 'రామమందిరం నిర్మాణం దేశం గర్వించదగ్గ విషయం. రామాలయ నిర్మాణం కోసం రాయిని ఎంపిక చేయడం పెద్ద సవాల్. కృత్రిమ మెటీరియల్‌తో కాకుండా సహజంగా లభించిన రాళ్లను అలానే తీసుకొచ్చి నిర్మించటం మాకు పెద్ద ఛాలెంజ్.' అని ఎన్ఐఆర్ఎం సీనియర్ శాస్త్రవేత్త రాజన్ బాబు తెలిపారు.
పిడుగులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా ఆలయాన్ని రూపొందించారు. ఆలయాన్ని స్టోన్ టు స్టోన్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఉపయోగించి నిర్మించినట్లు ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్త వెల్లడించారు. అలానే బాలరాముడికి సేవ చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
బాలరాముడి విగ్రహం ప్రత్యేకతలివే!
మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని రూపొందించారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను బాలరాముడి విగ్రహానికి ఇరువైపులా ఉండేలా అద్భుతంగా మలిచారు. రాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్ గుర్తు ఉన్నాయి. కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లను తీర్చిదిద్దారు. విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ, మరొకవైపు గరుడ ఉండేటట్లు విగ్రహాన్ని మలిచారు.
దశావతారాలు, హనుమ, గరుడ- బాలరాముడి విగ్రహం ప్రత్యేకతలివే!
'ప్రాణప్రతిష్ఠకు రండి'- అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆహ్వానం