Boy Fell In Borewell Rajasthan : రాజస్థాన్ దౌసాలోని బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 42 గంటలకు పైగా బోరుబావిలో ఉన్న చిన్నారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బోరుబావికి కొద్ది దూరంలో పైలింగ్ మిషన్‌తో 150 అడుగుల వరకు గొయ్యిను తవ్వుతున్నారు.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్యన్ తన తల్లితో ఆడుకుంటుండగా ఘటన జరిగింది. అనుకోకుండా ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతున్న బోరుబావిలో ఆర్యన్ ఒక్కసారిగా పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అధికారులకు సమచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ను అధికారులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దేవేంద్ర యాదవ్ అక్కడికి చేరుకుని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
తొలుత NDRF, SDRF బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్ ద్వారా ఆర్యన్‌ను బయటకు తీయడానికి చాలాసార్లు ప్రయత్నించాయి. కానీ విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత పలు విధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు పైలింగ్ మిషన్‌తో బోరుబావికి 4 నుంచి 5 అడుగుల దూరంలో 4 అడుగుల వెడల్పుతో గొయ్యి తీస్తున్నారు అధికారులు. 150 అడుగుల తవ్వకం పూర్తయిన తర్వాత, NDRF సిబ్బంది అందులో దిగి సొరంగం తవ్వి బాలుడి వద్దకు చేరుకోనున్నారు. అలా ఆర్యన్‌ను కాపాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.