ADR Report On Candidates Criminal Cases : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 102 లోక్‌సభ స్థానాలకు మెుదటి విడత పోలింగ్ జరగనుంది. ఆయా స్థానాలకు 1625 మంది నామినేషన్లు దాఖలు చేయగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్-ADR అనే సంస్థ 1,618 మంది అఫిడవిట్లను విశ్లేషించి ఒక నివేదికను విడుల చేసింది. ఈ 102 స్థానాల్లో 42 చోట్ల ముగ్గురు లేదా అంతకుమించిన అభ్యర్థులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు ADR పేర్కొంది. 1,618 మంది అభ్యర్థుల్లో 252 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని వివరించింది. ఏడు మందిపై హత్యకు సంబంధించిన కేసులు ఉండగా, 19 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను 18 మంది అఫిడవిట్‌లో పొందుపర్చగా, ఒకరు అత్యాచారం కేసును ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ తెలిపింది. 35 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని ADR తన నివేదికలో పేర్కొంది. మెుదటి విడత ఎన్నికలు జరగనున్న 102 స్థానాలలో 42 శాతం స్థానాలు రెడ్ అలర్ట్ నియోజకవర్గాలని ADR అభిప్రాయపడింది. అంటే ఆయా స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముగ్గురు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంటే ఆ స్థానాన్ని రెడ్ అలర్ట్ నియోజకవర్గంగా ADR నిర్వచించింది.
రాష్ట్రీయ జనతా దళ్ నుంచి పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. డీఎంకే తరఫున 22 మంది పోటీ చేస్తుండగా 13 మందిపై, ఎస్పీ తరఫున ఏడుగురు పోటీ చేస్తుండగా ముగ్గురిపై, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు పోటీ చేస్తుండగా ఇద్దరిపై, బీజేపీ తరఫున 77 మంది పోటీ చేస్తుండగా 28 మందిపై, కాంగ్రెస్ నుంచి 56 మంది పోటీ చేస్తుండగా 19 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. అన్నాడీఎంకే తరఫున 36 మంది పోటీ చేస్తుండగా 13 మందిపై, బీఎస్పీ తరఫున 86 మంది పోటీ చేస్తుండగా 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మెుదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 28 శాతం మంది కోటీశ్వరులని ADR తెలిపింది. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు 4 కోట్ల 51 లక్షలుగా ఉన్నాయని పేర్కొంది. RJD తరఫున పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు తమకు కోటికి పైగా ఆస్తులున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అన్నాడీఎంకే తరఫున బరిలో ఉన్న 36 మంది అభ్యర్థుల్లో 35 మంది, డీఎంకే తరఫున బరిలో ఉన్న 22 మంది అభ్యర్థుల్లో 21 మంది, బీజేపీ తరఫున బరిలో ఉన్న 77 మందిలో 69 మంది కోటికిపైగా ఆస్తులున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న 56 మందిలో 49 మంది, టీఎంసీ తరఫున పోటీ చేస్తున్న ఐదుగురిలో నలుగురు, బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న 86 మందిలో 18 మంది కోటికిపైగా ఆస్తులున్నాయని అఫిడవిట్‌లో పొందుపరిచారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా నుంచి బరిలో ఉన్న మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ అత్యధికంగా తనకు 716 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత తమిళనాడులోని ఈరోడ్ నుంచి బరిలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ 662 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తమిళనాడులోని శివగంగ నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి దేవనాధన్ యాదవ్ 304 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.