Driverless Electric Tractor : వ్యవసాయంలో రైతులకు వెన్నెముకగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి చేశాడు. ఆధునిక డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి ఏఐ జోడించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను అవిష్కరించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నేస్తుంది. అలాగే వేరే పనులను సైతం సునాయాసంగా చేసేస్తుంది.
రైతుకు డ్రైవర్ జీతం, డీజిల్ ఖర్చు ఆదా
పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా(25) అనే యువకుడు మగర్ పట్టాలోని వీఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగంలో చేరాడు. ఆపై 2019లో సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. 2023లో సిద్ధార్థ్ తన పరిశోధనను పూర్తి చేసి వీఆర్డీ మోటార్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో ఏఐ బేస్డ్ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను గుజరాత్, మధ్యప్రదేశ్‌లో తయారుచేయడం ప్రారంభించాడు. ఈ ట్రాక్టర్లను సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీంతో రైతుకు డ్రైవర్, డీజిల్ ఖర్చు ఆదా అవుతుంది.
అన్నీ స్వదేశీ పరికరాలే
15హెచ్‌పీ, 50హెచ్‌పీ సామర్థ్యం గల రెండు రకాల ట్రాక్టర్ల సిద్ధార్థ్ కంపెనీలో తయారవుతున్నాయి. ఈ ట్రాక్టర్ తయారీలో వాడిన బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను సోలార్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రాక్టర్లో మరొక అదనపు బ్యాటరీ ఉంటుంది. దీనికి ఛార్జ్ చేసి అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ఈ ట్రాక్టర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10-15 గంటల వరకు నిర్విరామంగా నడుస్తుంది. ఈ ట్రాక్టర్లు పేటెంట్ సైతం అందుకున్నాయి. త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ క్రమంలో రైతుల మేలు కోసం ట్రాక్టర్లను తయారుచేసిన సిద్ధార్థ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
'రైతుల కోసం ఏదైనా చేయాలనుకున్నా'
"ఇంజినీరింగ్ చదివేటప్పుడు రైతుల కోసం ఏదైనా చేయాలనుకున్నాను. అందుకోసం చాలా మంది రైతులతో మాట్లాడాను. ఆ తర్వాత అన్నదాతల కోసం డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై పరిశోధన చేశాను. ఈ ట్రాక్టర్ రైతులకు బాగా ఉపయోగపడుతుంది. 15హెచ్‌పీ ట్రాక్టర్ ధర రూ.3-4 లక్షలు, 50హెచ్‌పీ ట్రాక్టర్ ధర రూ.10-12 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఏఐ బేస్డ్ డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ట్రయల్ రన్ జరుగుతోంది. త్వరలో ఈ ట్రాక్టర్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉంది. రైతులకు రోజుకు 1-2 గంటలు మాత్రమే కరెంటు అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌కు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10-15 గంటలపాటు పనిచేస్తుంది. అలాగే రైతుకు డీజిల్‌తో పాటు డ్రైవర్ ఖర్చు కూడా ఆదా అవుతుంది." అని సిద్ధార్థ్ గుప్తా తెలిపాడు.