ఇజ్రాయెల్‌కు భారీ షాక్- ఆర్మీ కాన్వాయ్‌పై హమాస్ దాడి- 8మంది సైనికులు మృతి
Published : Jun 16, 2024, 6:31 AM IST
Hamas Attack On Israel: దక్షిణ గాజాలో హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సైనిక కాన్వాయ్‌పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) ధ్రువీకరించింది. రఫాలోని టెల్ సుల్తాన్ పరిసరాల్లో శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన ఐడీఎఫ్ దళాలు విశ్రాంతి తీసుకోవడానికి వెళుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. జనవరి తర్వాత గాజా పోరులో ఇంత మంది సైనికులను ఒక దాడిలో ఇజ్రాయెల్ కోల్పోవడం ఇదే తొలిసారి. జనవరిలో 21 మంది సైనికులు మృతి చెందారు. తాజా దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు. 8 మంది సైనికుల్లో ఒకరి పేరు కెప్టెన్ వసీం మహ్మద్ అని ఐడీఎఫ్ ప్రకటించింది.