India Vs Australia Border Gavaskar Trophy 2024 : న్యూజిలాండ్‌తో జరిగిన పోరు వల్ల ఒత్తిడిలో ఉన్న టీమ్‌ఇండియా ఇప్పుడు బోర్డర్-గావస్కర్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో మరికొద్ది సేపట్లో తొలి టెస్టు ఆడనుంది. అయితే ఆసీస్‌లో గత రెండు సిరీస్‌లు గెలిచినా కూడా భారత్ ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సారి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో, అనుకూల పరిస్థితుల్లో ఆడనున్న ఆస్ట్రేలియాను ఓడించడం మన జట్టుకు పెను సవాలనే చెప్పాలి. అయితే కంగారూ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. రోహిత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో భారత్‌కు బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు.
ప్రతికూలతలను అధిగమించేనా :
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురికావడం టీమ్‌ఇండియాకు పెద్ద షాక్. అది జట్టు నైతిక స్థైరాన్ని దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. అసలే పేలవ ఫామ్‌తో సతమతమవుతోన్న భారత్‌కు రోహిత్ గైర్హాజరీ (తొలి టెస్టుకు), కీలక పేసర్ షమి లేకపోవడం, గాయంతో గిల్ ఈ మ్యాచ్‌కు దూరంగా కావడం పెద్ద ఎదురుదెబ్బ. జట్టులో అనుభవం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డున్న సీనియర్ బ్యాటర్ కింగ్ కోహ్లిపై పెద్ద బాధ్యతే ఉంది. కానీ పరుగుల వేటలో ఈ ఏడాది అతడి రికార్డేమీ బాగాలేదు. 2024లో 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22.72 సగటుతో పరుగులు చేశాడు. బహుశా ఆసీస్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడుతోన్న కోహ్లి ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం.
మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై కూడా అందరి కళ్లూ ఉన్నాయి. ఫామ్‌లో లేని అతడికి ఈ సిరీస్ ఎంతో ముఖ్యమైంది. జైస్వాల్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. దేవ్‌దత్ పడిక్కల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఇక వికెట్‌కీపర్ బ్యాటర్‌పై పంత్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో ఆసీస్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు, ఇప్పుడు కూడా ఫామ్‌లో ఉన్నాడు. తనదైన శైలిలో ఆడితే సిరీస్‌లో చాలా కీలకమవుతాడు. భారత్-ఎ తరఫున ఆస్ట్రేలియా-ఎపై అదరగొట్టిన వికెట్‌కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ బ్యాటర్‌గా జట్టులో కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్‌లో కెప్టెన్ బుమ్రానే భారత్‌కు అతి పెద్ద బలం. ఆసీస్‌లో గొప్ప రికార్డున్న అతడు ఈసారి కూడా చెలరేగుతాడని జట్టు ఆశిస్తోంది.
తెలుగు కుర్రాడి అరంగేట్రం
ఇటీవల కాలంలో తన పెర్ఫామెన్స్‌తో క్రీడాభిమానులను ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డి ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. జట్టు సమతూకానికి అతడు ఎంతో ఉపయోగపడతాడంటూ కెప్టెన్ బుమ్రా అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇక దిల్లీ పేసర్ హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. సిరాజ్, వాషింగ్టన్ సుందర్ కూడా తమ స్కిల్స్‌తో జట్టుకు బలాన్ని చేకూర్చనున్నారు.
Virat Kohli presented the debut cap to Nitish Kumar Reddy. pic.twitter.com/YEkqNQaIJC
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ : లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ డీటెయిల్స్- ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
'ఎవరిని మీడియం పేసర్ అంటున్నావ్?- నేను 150 స్పీడ్‌తో బౌలింగ్ చేస్తా'