నిద్రపోతున్న వృద్ధురాలిపై ఏనుగు దాడి- వెంటనే పక్కింటికి వెళ్లి! - Wild Elephant Attacked Old Woman
Published : Mar 14, 2024, 4:50 PM IST
Wild Elephant Attacked Old Woman : ఇంటి బయట నిద్రపోతున్న వృద్ధురాలిపై దాడి చేసింది ఓ ఏనుగు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన ఏనుగు, 70 ఏళ్ల వృద్ధురాలిని తొండంతో కొట్టింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులోని మడుక్కరయ్ అటవీ ప్రాంతంలో జరిగింది.
గత కొన్ని రోజులుగా అడవిలో సరైన ఆహారం దొరక్కపోవడం వల్ల జనావాసాల్లోకి వస్తున్నాయి ఏనుగులు. ఇళ్లలోకి ప్రవేశించి అరటి, కొబ్బరి కాయలను తిని, నీటి పైపులను ధ్వంసం చేసి వెళ్తున్నాయి. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కరడిమడయ్ గ్రామంలోని విష్ణు అనే వ్యక్తి ఇంట్లోకి ఏనుగు ప్రవేశించింది. ఆహారం కోసం వచ్చిన ఏనుగు, ఆరుబయట నిద్రపోతున్న 70ఏళ్ల నాగమ్మాల్పై దాడి చేసింది.
దీంతో ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అక్కడినుంచి వెళ్లిన ఏనుగు, పక్కనే ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ నిద్రపోతున్న ధనలక్ష్మి, సత్య అనే ఇద్దరిపైనా దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సమాచారం అందుకున్న అటవీ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరలించి, క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.