భద్రాద్రిలో వెండి వాకిలి - ఏకంగా 103 కిలోలతో పనులు
Published : Feb 1, 2024, 5:29 PM IST
Vendi Vakili Works in Bhadradri Temple : భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వంద కిలోల వెండితో వెండి వాకిలి తయారు చేస్తున్నారు. ప్రముఖ స్థపతి దండపాణి ఆధ్వర్యంలో ఈ పనులను ఆలయ కార్యనిర్వాహణాధికారి రమాదేవి పర్యవేక్షిస్తున్నారు. భక్త రామదాసు ఆలయం నిర్మించిన నాటి నుంచి అంతరాలయంలో ఎలాంటి మార్పులు జరగలేదు. గతంలో అంతరాలయం ముందు మొదటి ద్వారం వద్ద ఉన్న వాకిలికి బంగారు వాకిలిని తయారు చేయించారు. ప్రస్తుతం అంతరాలయం నుంచి రెండో ద్వారం వద్ద వెండి వాకిలిని తయారు చేయిస్తున్నారు. చాలాకాలంగా పలువురు రామభక్తులు వారికి తోచిన విధంగా స్వామివారికి పలు ప్రత్యేక ఆభరణాలు కానుకలుగా అందిస్తున్నారు.
భక్తులు ఇచ్చే నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వామివారికి కానుకలుగా వస్తున్నాయి. భక్తులు స్వామి వారికి సమర్పించిన వెండితో తాజాగా స్వామివారి ప్రధాన ఆలయంలోని రెండో ముఖద్వారానికి 103 కేజీల వెండితో వెండి వాకిలిని తయారు చేస్తున్నారు. అతి సుందరమైన స్వామివారి దశావతార ప్రతి రూపాలతో తోరణాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేవస్థానం తరఫున కొంత వెండిని కేటాయించగా, పలువురు భక్తులు కొంత వెండిని విరాళంగా అందజేశారు.