పారాగ్లైడింగ్ చేస్తూ తెలంగాణ యువతి మృతి - హిమాచల్ ప్రదేశ్‌లో దుర్ఘటన - పారాగ్లైడింగ్ చేస్తూ యువతి మృతి
Published : Feb 12, 2024, 10:30 PM IST
Telangana Woman Dies in Kullu Paragliding Accident : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన యువతి విహారయాత్రకు వెళ్లి పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన, హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని శిల్ప బృందావనం కాలనీకి చెందిన సాయి మోహన్, పేరురి నవ్య (27) దంపతులు చండీగఢ్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ కంపెనీ విహారయాత్ర ప్యాకేజీ ఇవ్వడంతో శనివారం ఇద్దరు దంపతులు హిమాచల్ ప్రదేశ్‌లోని కులూమనాలీకి విహారయాత్రకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు హుక్ ఊడిపోయి నవ్య ఆకాశం నుంచి ఓ భవనంపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమెతో కలిసి పారాగ్లైడింగ్ చేసిన పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం మానవ తప్పిదంగా జరిగిందని హిమాచల్ పర్యాటకశాఖ అధికారులు నిర్ధారించారు. విహార యాత్రకు వెళ్లిన కోడలు మృతి చెందడం పట్ల జహీరాబాద్‌లో నివాసముండే సాయి మోహన్ తండ్రి తిరుమల రావు విషాదంలో మునిగిపోయారు. కోదాడకు చెందిన తిరుమల రావు కుటుంబం గత కొన్నేళ్లుగా జహీరాబాద్‌లో స్థిర నివాసం ఉంటున్నారు. ప్రత్యేక విమానంలో నవ్య మృతదేహాన్ని ఇవాళ రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడ నుంచి స్వస్థలానికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.