తామర పువ్వులతో ఏడుపాయల అమ్మవారికి అలంకరణ - వీడియో వైరల్ - Edupayala VanaDurga Devi
Published : Aug 16, 2024, 11:20 AM IST
Varalakshmi Vratham in Edupayala VanaDurga Temple : శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారికి తామర పువ్వులతో (కమల పూలు) విశేష అలంకరణ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు.
ఆలయ ప్రాంతంలో ఉన్న మంజీరా నదీలో భక్తులు స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో, ఛైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానము కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. నేడు రెండో శ్రావణ శుక్రవారం కావడం విశేషం.