సింహగిరిపై అట్టహాసంగా సీతారాముల కల్యాణం - పట్టువస్త్రాలు సమర్పించిన ఆలయ ఈవో - Seetha Rama Kalyana Mahotsavam - SEETHA RAMA KALYANA MAHOTSAVAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 2:49 PM IST
Seetha Rama Annual Kalyana Mahotsavam at Simhachalam: విశాఖ జిల్లా సింహచలంలోని సింహగిరి కొండపై పవిత్ర గంగధార వద్ద కొలువైన శ్రీసీతారామ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. సింహద్రి అప్పన్న ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు సీతారాములను పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ ఉత్సవ మండపంలోని వేదికపై ఆశీనులను చేశారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచన పూజలు అర్చకులు జరిపారు.
కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ చేసి వేదమంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుకను సంప్రదాయ బద్ధంగా జరిపించారు. అనంతరం ముత్యాల తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని జానకి రాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి పరిణయోత్సవాన్ని భక్తులు విశేషంగా తిలకించారు. అనంతరం అర్చకులు భక్తులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.