బీఆర్ఎస్ ఛలో ఆటో ర్యాలీలో ఉద్రిక్తత - పోలీసులతో కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వాగ్వాదం - పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొడవ
Published : Feb 9, 2024, 7:35 PM IST
Quthbullapur MLA Vivekananda Argument with Police : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి, అసెంబ్లీ వరకు చేపట్టిన ఛలో ఆటో ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వరకు చేరుకోగానే ఆటోలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే పరిస్థితిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌కు, పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించక పోవడంతో, ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌పై దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానన్న ఏసీపీ, రాజకీయ నేతల్లా తిట్టడం రాదని ఎమ్మెల్యేను ఏసీపీ మందలించారు.
BRS MLAs Auto Rally Issue : ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన వారిలో వివేకానందతోపాటు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నా కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులకు, ఎమ్మెల్యే వివేకానందకు మధ్య ఈ ఘర్షణ తలెత్తింది.