మరమ్మతు పూర్తి చేసి నీళ్లు వదిలారో లేదో మళ్లీ గండి పడింది - Paleru Left Canal Breached - PALERU LEFT CANAL BREACHED
Published : Sep 21, 2024, 10:19 PM IST
Paleru Left Canal Once Again Breached : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాలువ రైతుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఇటీవల భారీవరదలకు గండి పడి పంటలు నష్టపోయిన రైతులకు మరో షాక్ తగలింది. ఇవాళ కాలువకు మరోసారి గండి పడింది. ఇటీవల గండి పడ్డ ప్రాంతంలో అధికారులు మరమ్మతు పనులు పూర్తి చేసి ఈరోజు నీటిని విడుదల చేశారు. కొద్దిసేపటికే పోసిన మరమ్మతులు చేసిన చోటే మరలా గండిపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నీటిని నిలిపివేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
గత నెల కురిసిన భారీవర్షాలకు పాలేరు ఎడమ కాలువకు ఈ నెల 1న గండి పడింది. ఆ సమయంలో సుమారు 150మీటర్ల వరకు మట్టి కొట్టుకుపోయింది. గత పది రోజులుగా యుద్ధ ప్రాతిపదికన కోట్ల రూపాయలు వెచ్చించి, పలువురు మంత్రుల పర్యవేక్షణలో మరమ్మతులు చేశారు. అయితే నీటిని విడుదల చేసిన కాసేపటికే మరల గండి పడటంతో మరమ్మతు పనుల నాణ్యతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.