ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నందిగామలో మున్సిపల్ కార్మికుల ధర్నా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 9:41 PM IST
Municipal Workers Strike for Fulfill Promises in NTR District : సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తమతో సమ్మెను విరమింపజేసి నెల రోజులు గడుస్తున్నా అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మున్సిపల్ కార్మికులు ఎన్టీఆర్ జిల్లాలో ధర్నా నిర్వహించారు. నందిగామ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు. గతంలో 16 రోజుల పాటు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసిన సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలను ప్రభుత్వం ఇంత వరకు నెరవేర్చలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కటార్పు గోపాల్ మండిపడ్డారు. సమ్మె చేసిన 16 రోజులకు కూడా వేతనాలు చెల్లిస్తామని చెప్పి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.