Sugar Level Increase Reasons: ప్రస్తుత జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ చాలా మందిలో కనిపిస్తోంది. ఫలితంగా మధుమేహం వచ్చిన తర్వాత ఆహార పద్ధతులను, జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిస్థతులు ఏర్పడుతున్నాయి. అయితే, ఈ సమయంలో చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల శరీరంలో చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీ రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఈ తప్పులు చేయకూడదని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తగినంత నిద్ర లేకపోవడం
మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సరైన విశ్రాంతి అవసరం ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్ అయితే, రాత్రిపూట త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలని.. కనీసం 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోతే డయాబెటిస్ పెరిగిపోయే అవకాశం ఉందని Sleep Medicine Reviews జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది. "Impact of Sleep and Circadian Disturbances on Glucose Metabolism and Type 2 Diabetes" అనే అంశంపై చేసిన పరిశోధనలో డాక్టర్ Eve Van Cauter పాల్గొన్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోతే.. అది జీవక్రియ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించారు. అలాగే, తక్కువసేపు నిద్రపోవడం వల్ల ఒత్తిడి, చిరాకు పెరిగి.. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవుతుందన్నారు. ఫలితంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుందని వివరించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రాత్రి భోజనం తర్వాత
చలి కాలం వచ్చేసింది. దీంతో దాదాపు అందరికీ శరీరం చాలా బద్ధకంగా మారుతుంది. రాత్రి అయితే, భోజనం చేయగానే.. నేరుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటారు చాలా మంది. కానీ మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే ఇలా చేయడం మంచి పద్దతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత నేరుగా పడుకోకూడదని.. కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడవాలని సలహా ఇస్తున్నారు.
స్వీట్లు తింటున్నారా?
ఇంకా రాత్రి పడుకునే ముందు భోజనం చేసి స్వీట్లు టీ, కాఫీ తీసుకోవడం కొందరికి అలవాటు ఉంటుంది. అయితే, ఇలా చేయడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీకు స్వీట్లు తినాలనిపిస్తే కొద్దిగా దేశీ బెల్లం తినవచ్చని సూచిస్తున్నారు. టీ లేదా కాఫీకి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని తాగాలని సలహా ఇస్తున్నారు.
డిన్నర్లో ఈ పొరపాట్లు చేయకూడదు
రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే ప్రతిరోజు భోజనం ఒకే సమయానికి చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా వీలైనంత త్వరగా రాత్రి భోజనం పూర్తి చేయడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. అలాగే నూనె పదార్థాలు, కార్బోహైడ్రేట్లు నిండిన పదార్థాలు తినకూడదని.. తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా తెల్ల అన్నానికి, బంగాళాదుంపలకు దూరంగా ఉండాలని.. బదులుగా, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు.
నీరు అధికంగా తీసుకోవాలి
చలికాలంలో ఎక్కువగా దాహం అనిపించదు. ఫలితంగా నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరానికి సరైన మొత్తంలో నీరు లభించదు. ఇంకా చాలా మంది రాత్రిపూట పదేపదే టాయిలెట్ వెళ్లాల్సి వస్తుందని.. రాత్రిపూట నీరు తాగడం మానేస్తారు. ఇలా నీటిని తక్కువగా తాగడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని అంటున్నారు. అందుకే ప్రతిరోజూ శరీరానికి తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యమని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు 6-6-6 రూల్ తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే గుండె సమస్యలు అసలే రావట!
ఆ సమయంలో ఎక్కవ చక్కెర తీసుకుంటే మధుమేహం వస్తుందట! హైపర్ టెన్షన్ కూడా వచ్చే ఛాన్స్!!