Top Up Personal Loan : చాలా మంది తమ వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ డబ్బులు ఏ మాత్రం సరిపోవు. దీనితో ఏం చేయాలో, మిగతా డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి వారికి అక్కరకు వచ్చేవే టాప్-అప్ లోన్స్. అంటే మీరు బ్యాంకు నుంచి తీసుకున్న లోన్‌కు అదనంగా మరికొంత డబ్బును రుణంగా తీసుకోవచ్చు అన్నమాట.
ఉదాహరణకు మీ ఇంట్లో జరిగే వివాహం కోసం రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుందని మీరు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా మీరు రూ.10 లక్షలు వరకు బ్యాంక్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. కానీ తరువాత మరో రూ.2 లక్షలు అదనంగా అవసరం అయ్యాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మందికి ఏం చేయాలో పాలుపోదు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి లోన్ తీసుకుంటూ ఉంటారు. లేదా తమ క్రెడిట్ కార్డ్‌ను వాడుతుంటారు. మరికొందరు తమ విలువైన వస్తువులు లేదా ఆస్తులు అమ్మకానికి పెడతారు. కానీ ఇలా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సింపుల్‌గా మీరు టాప్-అప్ లోన్ తీసుకోవచ్చు.
మరో ఉదాహరణ చూద్దాం. రాజా తన భార్య రాణి కోసం రూ.6 లక్షల విలువైన డైమండ్ రింగ్ కొందామని అనుకున్నారు. ఇందుకోసం బ్యాంక్ నుంచి రూ.6 లక్షలు పర్సనల్ లోన్‌గా తీసుకున్నారు. కానీ సదరు డైమండ్ రింగ్‌పై 3 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందనే విషయం అతను మరిచిపోయారు. దీనితో అదనపు సొమ్ము కోసం ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు. ఇలానే చాలా మంది అదనపు డబ్బులు అవసరం అయినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు కూడా తాము ఇప్పటికే తీసుకున్న పర్సనల్ లోన్‌పై టాప్-అప్ ఆప్షన్ ఉపయోగించుకుని అదనపు రుణం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
తక్కువ వడ్డీతో లోన్
బ్యాంకులు తాము ఇచ్చిన కరెంట్ పర్సనల్ లోన్స్‌పై టాప్-అప్ ఆప్షన్‌ను అందిస్తూ ఉంటాయి. అంటే ఇప్పటికే ఇచ్చిన లోన్‌తో పాటు అదనంగా మరికొంత డబ్బును రుణంగా ఇస్తాయి. అది కూడా చాలా తక్కువ వడ్డీ రేటుతో ఈ రుణాన్ని అందిస్తాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తూ, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు ఈ సదుపాయం కల్పిస్తాయి.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.