ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్సీ వెంకట్ - విద్యార్థుల సమస్యలే పరిష్కారంగా అసెంబ్లీలోకి అడుగు
Published : Feb 8, 2024, 2:09 PM IST
MLC Balmuri Venkat Travelled in RTC Bus : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మొదటిరోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్‌లో వచ్చారు. నాంపల్లిలో బస్ ఎక్కి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అమరవీరుల ఆశీర్వాదాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా తనను సభలోకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఆగ్రనాయకులు పంపించారని పేర్కొన్నారు.
10 ఏళ్లు యువకుల పక్షాన పోరాటం చేశానని, ఇప్పుడు ఆ యువ 'కులం' సమస్యలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని అమర వీరుల సాక్షిగా చెప్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువకులు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ఎప్పటికీ తన కులం యువ కులమేనని చెప్పారు. తన వద్దకు వచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని వెంకట్ స్పష్టం చేశారు.