తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్
Published : Feb 6, 2024, 7:31 PM IST
Minister Uttam Kumar Fires On KCR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాలు ఆంధ్ర ప్రభుత్వం దోచుకునేలా కేసీఆర్ వైఖరి అవలంభించారని విమర్శించారు. ఎందుకు కేసీఆర్ ఇప్పటి వరకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీపై నోరు మెదపలేదని ప్రశ్నించారు. అన్ని విషయాలపై విపక్షాలతో చర్చలు పెడతామని తెలిపారు.
రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టి కుంగిపోయేలా బ్యారేజీలు కట్టి, నాసిరకం ప్రాజెక్టులు నిర్మించి ప్రజాధనాన్ని ఖూనీ చేసి వాళ్లు కూడా తమపై విమర్శలు చేయడం అంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదన్నారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవడం కేసీఆర్కు తెలిసినట్లు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభ అనుమతులపై పోలీసులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. కేసీఆర్కు నీళ్ల గురించి కాదని, నిధులు ఎలా దోచుకోవడం అనేదే తెలుసని విమర్శించారు.