'ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు' : హరీశ్‌రావుపై శ్రీధర్‌బాబు సీరియస్
Published : Oct 13, 2024, 3:17 PM IST
Minister Sridhar Babu Fires On Harish Rao : మండలి ప్రభుత్వ చీఫ్ విప్ సహా నియామకాలు రాజ్యాంగ బద్ధంగానే జరిగాయని, ఎక్కడా ఉల్లంఘన లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో హరీశ్‌రావు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మందిని ఒకరి తర్వాత ఒకరు పార్టీలోకి చేర్చుకున్నారని మంత్రి గుర్తు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మండలి ఛైర్మన్, సభాపతి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. సంప్రదాయం ప్రకారమే ప్రతిపక్ష సభ్యునికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అనర్హతా పిటిషన్ల అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రభుత్వ తీరును హరీశ్‌రావు తప్పుబట్టారు. దీనిపై తాజాగా శ్రీధర్ బాబు స్పందించి మాజీమంత్రిపై మండిపడ్డారు.