బీజేపీ హయాంలో ఉపాధి హామీచట్టం నిర్వీర్యం : మంత్రి సీతక్క - seethakka fires on bjp
Published : Jun 10, 2024, 5:45 PM IST
Seethakka fires on BJP : రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు విషయంలో, కింది స్థాయి ఉద్యోగులు చేస్తున్న తప్పిదాల వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో "గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు- సవాళ్లు" అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో రూపొందించిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, గత బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక లోకాన్ని విస్మరించి.. కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు విషయంలో కూడా కిందిస్థాయి కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని ఫలితంగా ప్రభుత్వంపై చెడు అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.