వ్యర్థాలను స్వయంగా తొలగించిన మంత్రి పొన్నం - పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపు - Minister Ponnam Removed the Garbage - MINISTER PONNAM REMOVED THE GARBAGE
Published : Sep 24, 2024, 5:34 PM IST
Minister Ponnam Cleared Ganesh Nimajjanam Waste : స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలే క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గణేశ్ నిమజ్జన వ్యర్థాలను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలగించారు. గణనాథుని నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నామని, ఆ ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు. వినాయక విగ్రహాలను ఏ జలాశయలు, చెరువుల్లో అయితే వేశామో ఆ వ్యర్ధాలను మనం అక్కడి నుంచి తొలగించినప్పుడే గణేశ్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులలో నిమజ్జన వ్యర్ధాలను గణపతి మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు. అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. అంతకముందు మున్సిపల్ అధికారులు, క్రీడాకారులతో కలిసి స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ చేయించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఖాళీ స్థలాలలో దోమలకు నిలయంగా మురుగు నీరు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు.